పేదల కోసం17వేల గ్రామాలను నిర్మిస్తున్నాం..


Ens Balu
3
Vizianagaram
2021-06-15 09:31:58

ఒకటి కాదు రెండ కాదు...రాష్ట్రంలో ఏకంగా 17వేల ఊర్లు నిర్మిస్తున్నాం. అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించి, జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను మోడ‌ల్‌గా తీర్చిదిద్దాల‌న్నది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, రాష్ట్ర గృహ‌నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ‌రంగ‌నాధ‌రాజు అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖ‌లూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేయాల‌ని కోరారు. న‌వ‌ర‌త్నాలు లో భాగంగా, జిల్లాలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌తో క‌లిసి మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షించారు.ఈ సంద‌ర్భంగా  గృహ‌నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద‌ల‌కు ఏకంగా 30ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి సంక‌ల్ప‌మ‌ని అన్నారు. ఇది దేశంలోనే అతి గొప్ప కార్య‌క్ర‌మ‌మ‌ని పేర్కొన్నారు. కుల‌, మ‌త‌, రాజ‌కీయాల‌కు అతీతంగా అర్హులైన ప్ర‌తీ పేద‌వాడికి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తొలిద‌శ‌లో రాష్ట్రంలో సుమారు 15ల‌క్ష‌ల ఇళ్ల‌ను మార్చి 31 నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. జ‌గ‌నన్న కాల‌నీల్లో సుమారు రూ.30వేల కోట్ల‌తో అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తుల‌నూ క‌ల్పించి, వాటిని మోడ‌ల్ కాల‌నీలుగా అభివృద్ది చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇది కేవ‌లం సంక్షేమ కార్య‌క్ర‌మ‌మే కాద‌ని, అతిపెద్ద‌ అభివృద్ది కార్య‌క్ర‌మమని స్ప‌ష్టం చేశారు. ఒకేసారి వేలాది ఇళ్ల‌ను నిర్మించ‌డం వ‌ల్ల‌, జ‌గ‌న‌న్న కాల‌నీలు గ్రామీణ ఉపాదికి కేంద్ర‌బిందువుగా మార‌నున్నాయ‌ని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా సుమారు 90 మందికి, ప‌రోక్షంగా మ‌రో 40 మందికి ఉపాది ల‌భిస్తుంద‌ని అన్నారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని అధికారులంతా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని మంత్రి చెరుకువాడ కోరారు. దీనిలో భాగంగా నిర్మించే ఇళ్ల‌కు ఇసుక‌ను ఉచితంగా అంద‌జేస్తామ‌ని, నిర్మాణ సామ‌గ్రిని కూడా త‌క్కువ ధ‌ర‌కు అంద‌జేస్తామ‌ని  తెలిపారు. అందువ‌ల్ల ఇది ల‌బ్దిదారుడికి భారం కాబోద‌ని అన్నారు. గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌తీ గ్రామానికి ఒక మండ‌ల స్థాయి అధికారిని, నియోజ‌క‌వ‌ర్గానికి జిల్లా స్థాయి అధికారిని ఇన్‌ఛార్జిగా నియ‌మించాల‌ని ఆదేశించారు. ప్ర‌తీ 20 ఇళ్ల‌కు ఒక స‌చివాల‌య ఉద్యోగిని బాధ్యులుగా నియ‌మించి, ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌న్నారు. ఒకేసారి పునాదుల‌ను ప్రారంభింప‌జేయ‌డం, సామ‌గ్రిని కూడా న‌లుగురైదుగురు ల‌బ్దిదారులు క‌లిపి తెప్పించుకోవ‌డం వ‌ల్ల ఖ‌ర్చులు క‌లిసి వ‌స్తాయ‌ని సూచించారు. స‌క్రమంగా త‌క్కువ ధ‌ర‌కు ఇసుక‌ను అందించ‌డానికి కాల‌నీల‌కు స‌మీపంలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని జెసిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ ప్ర‌క్రియ‌లో ల‌బ్దిదారుడిని పూర్తిగా భాగ‌స్వామిని చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ముఖ్యంగా గ్రామాల్లో స‌ర్పంచ్‌లు, ప‌ట్ట‌ణాల్లో కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు ముందుకు వ‌చ్చి, ఇళ్ల నిర్మాణం త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల‌ని సూచించారు. నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నీటి వ‌స‌తి, విద్యుత్‌, ఇసుక‌ను అంద‌జేయాల‌ని కోరారు.

                హౌసింగ్ ఎండి భ‌ర‌త్ నారాయ‌ణ‌మూర్తి గుప్తా మాట్లాడుతూ, గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఎంతో ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని చెప్పారు.  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లూ దీనిలో భాగ‌స్వాములు కావాల‌ని, స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని కోరారు. పెద్ద‌పెద్ద కాల‌నీల‌ను సెక్టార్లుగా విభ‌జించి, ప్ర‌తీ 20 ఇళ్ల‌కు ఒక ఇన్‌ఛార్జిని నియ‌మించాల‌ని సూచించారు. వివిధ స్థాయి అధికారుల‌తో క‌మిటీల‌ను రూపొందించి, వాటి ద్వారా ల‌బ్దిదారులను చైత‌న్య‌ప‌రిచేందుకు కృషి చేయాల‌ని కోరారు.

              అంత‌కుముందు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(హౌసింగ్‌) కె.మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లాలో గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మం ప్ర‌గ‌తిని వివ‌రించారు. జిల్లాలో  98,286 ఇళ్లు మంజూరయ్యాయ‌ని, అయితే వివిధ కార‌ణాల‌వ‌ల్ల 15,676 ఇళ్లు మంజూరు ఆగింద‌ని, మిగిలిన 82,610 ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని తెలిపారు.  వీటిలో 51,710 మందికి లేఅవుట్ల‌లో ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేసి, ఇళ్ల‌ను నిర్మిస్తామ‌ని, 30,900 మందికి పొజిష‌న్ ప‌ట్టాలతో ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక ల‌భ్య‌త‌, స్టాక్‌పాయింట్లు, స‌ర‌ఫ‌రాకు చేసిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు.  వివిధ మున్సిపాల్టీల ఛైర్ ప‌ర్స‌న్లు, క‌మిష‌న‌ర్లు, త‌మ మున్సిపాల్టీల్లోని స‌మ‌స్య‌ల‌ను తెలిపి, ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

              ఈ స‌మీక్షా స‌మావేశంలో ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు, ఎంఎల్ఏలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వి.విజ‌య‌లక్ష్మి,  హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ సిఇఓ శివ‌ప్ర‌సాద్‌, జిల్లా హౌసింగ్ పిడి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి, వివిధ శాఖ‌ల అధికారులు, హౌసింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.