వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా జిల్లాలో 2021-22కు గాను 25,794 మంది లబ్ధిదారులకు రూ.25.79 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుతున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర రవాణా; సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించే కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఒక్కొక్కరికీ ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందుతోంది. వరుసగా మూడో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2,48,468 మంది లబ్ధిదారులకు రూ.248.47 కోట్ల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, కాకినాడ ఎంపీ వంగా గీత; కాకినాడ అర్బన్, రాజోలు, పి.గన్నవరం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు; ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నమోదైన 23,987 దరఖాస్తులకు అదనంగా ఈ ఏడాది కొత్తగా 4,678 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మొత్తం 28,665 దరఖాస్తులకు గాను 25,794 దరఖాస్తులు పథకం కింద లబ్ధిపొందేందుకు ఆమోదం పొందాయని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగిందని, లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హత ఉన్నవారు మిగిలిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. స్వీయ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మద్యం తాగి వాహనం నడపొద్దని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీటీసీ ఎ.మోహన్, జిల్లా రవాణా శాఖ అధికారులు ఆర్.రాజేంద్రప్రసాద్, బి.శ్రీనివాస్, ఎం.అప్పారావు, ఆర్.సురేశ్ తదితరులతో పాటు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.