రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని యజ్ఞంలా చేపట్టి పూర్తిచేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. ఇళ్ల నిర్మాణం లబ్దిదారులకు భారం కాకుండా చూసేందుకు మార్కెట్ ధరల కంటే 30 నుంచి 40శాతం తక్కువ ధరలకే ఇంటి నిర్మాణ సామాగ్రిని లబ్దిదారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇళ్లు నిర్మించుకొనే లబ్దిదారులకు ఇసుక అందుబాటులో వుండేలా వారి సొంత గ్రామానికి సమీపంలో వుండే నది లేదా గెడ్డల నుంచి ఇసుకను తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి సమీపంలోనే ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణం, వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీల్లో అవసరమైన మౌళిక వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఛాంబరులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లాకు చెందిన ఎం.పి.లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో గృహనిర్మాణంలో వున్న సమస్యలు వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులతో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వాగులు, గెడ్డల నుంచి ట్రాక్టర్లపై కూడా ఇసుక తీసుకువెళ్లేందుకు శాసన సభ్యులు అనుమతించాలని కోరారని ఆ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు సూచించామని చెప్పారు.
విజయనగరం జిల్లాలో 80 వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని, మండలంలోని ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని, ప్రతి ఇరవై ఇళ్లకు గ్రామస్థాయి ఉద్యోగి ఒకరికి బాధ్యతలు అప్పగించి ఇళ్ల నిర్మాణాన్నిపర్యవేక్షించాలని జిల్లా అధికారులకు సూచించినట్టు చెప్పారు. జిల్లాలో చేపడుతున్న గుంకలాం వంటి భారీ హౌసింగ్ కాలనీల్లో భూగర్భంలోనే విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్‌టీవీ కేబుళ్లు, తాగునీటి సరఫరా పైప్‌లైన్లు వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని హౌసింగు కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనుందని మంత్రి వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వానికి ఇదే ప్రధాన కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ చేపట్టడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా సమయంలో ఉపాధి కల్పించడంతో పాటు పేదలకు లక్షల విలువైన ఆస్తిని సమకూర్చడం, సంపద సృష్టించడం సాధ్యమవుతుందని, దీనివల్ల ఆర్ధిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల గృహాలను నిర్మించడం ద్వారా 4 లక్షల కోట్ల సంపద సృష్టించడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో గృహనిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు వచ్చే నెలలో మళ్లీ తాను జిల్లాకు వస్తానని, అప్పుడు నియోజకవర్గ స్థాయికి వెళ్లి ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తానన్నారు.
జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి ఏ పథకం ఏరోజు లబ్దిదారులకు అందజేస్తామో ముందుగా ప్రకటిస్తామో చెప్పి ఆ ప్రకారంగా పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. వాహనమిత్ర కింద దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి ఈ పథకాన్ని అందించడం ద్వారా రాష్ట్రంలోనే ఈ పథకం అమలులో విజయనగరం జిల్లా ముందంజలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మూడో విడత వాహనమిత్ర కింద జిల్లాలో 14,500 ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఈ పథకంలో రూ.15 కోట్లు అందజేయడం జరిగిందన్నారు.
మాన్సాస్ అంశంపై మంత్రి పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ హైకోర్టు తీర్పు ప్రతి ఇంకా అందవలసి వుందన్నారు. మాన్సాస్, సింహాచలం దేవస్థానం అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తాను భావిస్తున్ననని, ఈ విషయంలో ప్రభుత్వ వాదనలు వినిపిస్తామని మహిళలకు న్యాయం చేస్తామని మంత్రి చెప్పారు. దేవాలయాల భూములు కాపాడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. అవి అన్యాక్రాంతమైన చోట వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మాన్సాస్‌లో అక్రమాలు తప్పకుండా బయటపెడతామని మంత్రి చెప్పారు. ఈ సంస్థలో కొన్నివేల ఎకరాలు అన్యాక్రాంతమైతే దీని ఛైర్మన్‌గా వ్యవహరించిన అశోక్‌గజపతి వాటి పరిరక్షణకు ఏంచేశారని మంత్రి ప్రశ్నించారు. సింహాచలం ట్రస్టు బోర్డుకు ఛైర్మన్‌గా, మాన్సాస్ సంస్థ ఛైర్మన్‌గా ఆయా సంస్థలకు అశోక్ గజపతిరాజు చేసిందేమీ లేదని మంత్రి పేర్కొన్నారు.
బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి 4,011 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ భూములు ఏయే నియోజకవర్గాల్లో వున్నాయో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఆలయానికి ఉన్న నగలు ఏయే బ్యాంకుల్లో ఎంతమేరకు ఉన్నాయో, కోటలో ఎంత వున్నాయో లెక్కలు తేల్చాల్సి వుందన్నారు. కొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు.