కోవిడ్ నివారణలో మీడియా కీలకం..


Ens Balu
3
Srikakulam
2021-06-15 13:18:53

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నివారణకు మీడియా ఘణనీయమైన పాత్రను పోషించిదని, మీడియా ప్రసారం చేసే వార్తల వలన నోడల్ అధికారులుగా మండలస్థాయిలో కరోనాను నియంత్రించేందుకు అవకాశం కలిగిందని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు జి.నారాయణరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన జర్నలిస్టుల రక్షణ కొరకు ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ తో కలిసి పాత్రికేయులకు ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీచేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో ప్రతీ ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవడం చాలా అవసరమని అన్నారు. వార్తల సేకరణలో రేయింబవళ్లు పనిచేసేది మీడియా అని, అటువంటి మీడియాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సేవాతత్పరతతో ముందుకువచ్చి పాత్రికేయులకు ఫేష్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీచేసేందుకు ముందుకు వచ్చిన బెండి తారకేశ్వరరావు, మిత్రులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇదేస్పూర్తితో ప్రతీ వ్యక్తి పాత్రికేయుల సంక్షేమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని మీడియా మాత్రమే ప్రజల ముందుకు తీసుకురాగలదని చెప్పారు. కరోనా సమయంలో ప్రతీ విషయాన్ని మీడియా తమ దృష్టికి తీసుకువచ్చి కరోనా నివారణకు కృషిచేసిందని గుర్తుచేసారు.

సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ మాట్లాడుతూ రేయింబవళ్లు ప్రాణాలకు తెగించి వార్తల సేకరణలో ఉంటున్న మీడియావ్యవస్థను ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రపంచానికి మేల్కోలేపేది మీడియా అని, ప్రపంచంలో జరిగిన విషయాలను మనముందుకు తీసుకువచ్చేది మీడియా మాత్రమేనన్న  విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని చెప్పారు.  అటువంటి మీడియా కరోనా కారణంగా నేడు తీవ్రమైన కష్టాల్లో ఉందని, ఇటువంటి తరుణంలో దాతలు ముందుకు వచ్చి మీడియాకు వీలైనంత సహాయం చేయడం మంచి కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రతీ నిమిషానికి కోవిడ్ బాధితుల వివరాలను తెలియజేస్తూ, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడంలో  మీడియా కీలకపాత్ర వహించదని కొనియాడారు. కోవిడ్ నియంత్రణలో కూడా మీడియా ఘణనీయమైన పాత్ర పోషించిందని, కోవిడ్ వంటి కష్టకాలంలో మీడియాను ఆదుకునేందుకు ముందుకువచ్చిన దాతలను ఆయన అభినందించారు.  

ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి.ఇందిరా ప్రసాద్, కూన వెంకటరమణమూర్తి, ఎస్.జోగినాయుడు, సిహెచ్.సూర్యారావు, ఎం.మల్లిబాబు, మీడియా ప్రతినిధులు ఎం.ఏ.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, జి.వి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.