సీఎం వైఎస్ జగన్ అందర్నీ ఆదుకున్నారు..


Ens Balu
2
Srikakulam
2021-06-15 13:21:22

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.  మంగళవారం 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈ పథకం కింద రాష్ట్రంలో 2.48 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని, జిల్లాలో 14 వేల 695 మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వెల్లడించారు.  లబ్దిదారుల బాధలను అర్థం చేసుకొని కరోనా సంక్షోభం సమయం సందర్భంగా నెల రోజులు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి 10 వేల రూపాయలను ముఖ్యమంత్రి జమ చేసినట్లు చెప్పారు.  దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణ ఇస్తుందని, దిశ చట్టం వలన మహిళలు నిర్భయంగా ఆటోలపై ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేబినెట్ లో మహిళా ఉప ముఖ్యమంత్రులను నియమించినట్లు తెలిపారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 96 శాతం వరకు నేరవేర్చినట్లు పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వైద్య కళాశాలలకు ఈ నెలలో శంకు స్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, రవాణా శాఖ అధికారులు శివరాం, వేణుగోపాల్, చౌదరి సతీష్, రాజాపు అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.