భవనాలు నిర్మాణాలు వేగం పెంచండి..


Ens Balu
2
Srikakulam
2021-06-15 13:26:16

శ్రీకాకుళం  జిల్లాలో గ్రామ స్థాయిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను పూర్తి చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో భవన నిర్మాణాల పక్షోత్సవాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి పక్షోత్సవాలు ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయం, ఆర్.బి.కె, బి.ఎం.సి.యు, వై.యస్.ఆర్. క్లినిక్ లు, అంగన్వాడీ కేంద్రాల పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో పరిగెత్తి పని చేయుటకు సిద్ధంగా ఉన్నారని వారి సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. భవనాల నిర్మాణం ఆరు నెలలుగా వివిధ స్థాయిల్లో ఉన్నాయని వాటిని పూర్తి చేయడం వలన గ్రామాల రూపురేఖలు మారుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవనాలు అందుబాటులోకి రావడం వలన  గ్రామ స్థాయిలో మంచి  ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. భవనాల నిర్మాణం చేయలేదు అంటే రైతులకు సౌకర్యం లేదని, ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నామని గ్రహించాలని స్పష్టం చేసారు. రైతు భరోసా కేంద్రాలు జూలై 8న ప్రారంభించాలని అందుకు కనీసం 25 శాతం భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పక్షోత్సవాల 15 రోజుల్లో మిషన్ మోడ్ లో పనులు చేపట్టి ప్రారంభాలకు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. భవనాలు గ్రామస్తులకు శాశ్వత ప్రయోజనం కలిగిస్తాయని, అందరూ సమష్టిగా పనిచేయడం వలన సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తి చేయుటకు శాయశక్తులా కృషి చేయాలని, మన స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదని ఆయన ఉద్బోధించారు. వేగవంతంగా, సక్రమంగా జరగాలని అన్నారు. క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న మొత్తాల్లో రూ. 42 కోట్లు సోమవారం జమ అయిందని కలెక్టర్ తెలిపారు. జగనన్న కాలనీలు కూడా పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు.

       జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రతి మండలంలో జూలై 8న ఆరు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ బి.లక్ష్మీపతి, డిపిఓ వి.రవి కుమార్, డి.ఆర్.డి.ఏ పిడి బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.