గుంటూరు జిల్లాలో 22527 మందికి లబ్ధి..


Ens Balu
2
Guntur
2021-06-15 13:38:52

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 22527 మంది లబ్ధిదారులకు రూ. 10,000 చొప్పున రూ.22.527 కోట్లు లబ్దిదారులకు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం వాహన మిత్ర పధకం సొమ్మును లబ్దిదారుల ఖాతాకు ఆన్ లైన్ ద్వారా మళ్లించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రామానికి గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో అందిస్తున్న ఆర్ధిక సహాయం చాలా గొప్పది అని , సంక్షేమ పథకాలు అమలులో ఇతర రాష్ట్రాలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.  వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుంటూరుకు చెందిన ఆటో  డ్రైవర్ మురళీ శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతూ  అన్నా నేను గత 17 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాను, ప్రతీ ఏడాది కూడా ఫిట్నెస్ నెల వస్తుందంటే తెలియని బాధ, భయం ఉండేది, నెలవారీ ఖర్చులు, మెయిన్టెనెన్స్ ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండేవి. గత ప్రభుత్వంలో రోజుకు రూ. 50 ఫైన్ పెట్టి మా పీక మీద కత్తి పెట్టే పరిస్ధితి ఉండేదన్నారు. మీరు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్లుగా ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తున్నారని, మేం ఇంత ధైర్యంగా ఉన్నామంటే మీరే కారణం అన్నారు. మాకు ఫైన్లు వేసే ప్రభుత్వాలను చూశాం కానీ మాకంటూ ఒక పధకం పెట్టిన మొదటి సీఎం మీరే అని, మీరు దేశ రాజకీయ నాయకులకు ఒక రోల్మోడల్,  ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలి అనే దానికి మీరే ఉదాహరణ అని తెలిపారు. 

కరోనా కారణంగా కుటుంబం గడవని పరిస్ధితుల్లో ఉన్న మాకు వాహన మిత్ర పథకం  ముందుగానే ఇస్తున్నారని చెప్పారు. ఏ సంక్షేమ పధకం ఆగకూడదని మీరు మూడో విడత ఇంత కష్టకాలంలో ఇస్తున్నారు. మీకు మేమంతా రుణపడి ఉంటామన్నారు. నా కుటుంబంలో అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు కాపునేస్తం వచ్చింది, మా నాన్నకి వృద్దాప్య ఫించన్ వచ్చింది, తెల్లవారకముందే పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆలోచనకు హ్యట్సాఫ్. నేను నా కుటుంబం కోసం ఆటోడ్రైవర్ అయ్యాను, కానీ రాష్ట్రాన్ని అభివృద్ది, సంక్షేమ బాటలో నడిపే డ్రైవర్ మీరు అయ్యారు అని తెలిపారు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇద్దరూ ఆడపిల్లలు అయి ఉంటే బావుండు అనిపించింది. మహిళాబిల్లు కోసం పార్లమెంట్లో గొడవలు చూశాం కానీ మీరు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తుంటే నా పిల్లులు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేవి, మగపిల్లాడిని ఎలా సెటిల్ చేయాలా అన్న ఆలోచన పట్టుకుంది. మహిళా అభ్యుదయం కోసం మీరు చేస్తున్న కృషి మరువలేం. రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళ ఉండటం గర్వకారణం. 

మేం సామాన్యుడిగా ఒకటే కోరుకుంటున్నాం, మాకు మేడలు, మిద్దెలు వద్దు, మేం పస్తులు లేకుండా కడుపు నింపుకోవడానికి పని ఉండాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్ కోసం మంచి చదువు, ఏదైనా అనారోగ్యం వస్తే మంచి వైద్యం ఉండాలి. ఇవి మీరు చేస్తున్నారు. బ్లాక్ఫంగస్ లాంటి దాన్ని కూడా నాలుగు రోజులకే మీరు ఆరోగ్యశ్రీలో చేర్చారు, మేం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మీరే కారణం అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆటోడ్రైవర్తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం మాకు గర్వంగా ఉంది, ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని మేం నమ్ముతున్నామన్నారు. మేం ధైర్యంగా చెబుతున్నాం, మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుక్కున్నారు. మేమంటే అంత ప్రేమ, గౌరవం మీకు ఉన్నాయి. మీ వల్లే మేం సంతోషంగా జీవించగలుగుతున్నామన్నారు.

    జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులు 22527 మందికి రూ.22.527 కోట్లు చెక్కును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులతో కలిసి లబ్ధిదారులకు అందించారు.