విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలిని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకు ఆమె సంపూర్ణ మద్దతు తెలిపారు. మంగళవారం ఉక్కు కర్మాగారం ప్రధాన గేటు వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జివిఎంసి కౌన్సిల్ ఏర్పడిన వెంటనే ఏప్రిల్ 9వ తేదీన జరిగిన తొలి సమావేశంలోనే మొదటి అజెండాగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేసిందని దేశ చరిత్రలోనే ఇది అపురూపమైన ఘట్టమని తెలిపారు. మే, 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని తెలిపారు. అరవై నాలుగు గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని ఉక్కు కర్మాగారానికి త్యాగం చేశారని, 32 మంది కర్మాగారం కోసం ప్రాణత్యాగం చేశారని మేయర్ తెలిపారు. సుమారు లక్ష మంది పైబడి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఈ కర్మాగారం పై ఆధారపడి బతుకుతున్నారని, 20వేల కోట్ల పెట్టుబడితో ఇటీవల ప్లాంట్ విస్తరణ జరిగిందని కరోనా నేపథ్యంలో ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ను సరఫరా చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని, దేశంలో ఏ కార్పొరేట్ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం వలె ఆక్సిజన్ ను సరఫరా చేయలేదని ఇటీవల కరోనా పేషెంట్లు కొరకు 300 పడకల ఆక్సిజన్ బెడ్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని, 98 మంది కార్పొరేటర్లు మీవెంటే ఉన్నారని తెలిపారు. నిర్వాసితులు అందరికీ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జివిఎంసి కార్పొరేటర్లు గంగారావు, లేళ్ళ కోటేశ్వరరావు, మహమ్మద్ ఇమ్రాన్, శ్రీనివాస్, తిప్పల దేవాన్, చిన్న తల్లి, సూర్యకుమారి, మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య, ఉక్కు కర్మాగార యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, డి. ఆదినారాయణ, జె. అయోధ్యా రామ్, మస్తానఫా , తదితరులు పాల్గొన్నారు.