జగనన్న కాలనీలు వేగవంతం చేయాలి..


Ens Balu
2
Anantapur
2021-06-15 13:52:18

అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ జేసీ నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జగనన్న ఇళ్ల నిర్మాణాలపై స్థానిక హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ జేసీ నిశాంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంటే కేవలం ఇళ్లు కట్టి ఇవ్వడం కాదని, ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కలిగిన కాలనీలు అందించడమన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం పలు శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉన్నందున కేవలం ఇళ్ల నిర్మాణాలకోసమే ప్రత్యేకంగా జాయింట్ కలెక్టరును నియమించడం జరిగిందన్నారు. సమావేశంలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని మైనింగ్ ఏడీ కృష్ణమూర్తిని అదేశించారు. నాడు-నేడు పనులు దాదాపు పూర్తయిందున ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పేదల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాగ్యరాజ్ ను ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద నీటి వసతి కోసం బోర్లు తవ్వాలని, బోరు బావులు తవ్వినప్పటికి నీరు లభించని ప్రదేశాల్లో ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు. విద్యుత్ సప్లై పనులను పూర్తి చేసి నిర్మాణ పనులకు ఇబ్బంది రాకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఇళ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేసేందుకు సహకరించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, మైనింగ్ ఏడీ కృష్ణమూర్తి, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, జెడ్పీ సీఈవో శ్రీనివాసులు, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీశ్ చంద్ర, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు