పంటల విషయంలో.. భీమా విషయంలో రైతులకు ఉపయోగపడే విధానాలను రూపొందించాలని, దాదాపు అన్ని పంటలకూ వైఎస్సార్ భీమా వర్తించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో అమలు చేసిన విధానాలపై చర్చించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో అమలు చేయాల్సిన విధానాలపై సమీక్షించారు. ఏయే పంటలకు భీమా వర్తింప జేయాలి, ఏయే పంటలను భీమా పరిధి నుంచి తప్పించాలనే అంశాలపై కమిటీ సభ్యులు, అధికారులు చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అమలు చేయబోయే విధానాలు అంతిమంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో అధికంగా వరి పంటను వేస్తున్నప్పటికీ దాదాపు అన్ని పంటలకూ భీమా వర్తించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ-క్రాప్ సైట్‌లో సజ్జల పంటను జోడించాలని ఈ సందర్భంగా సూచించారు. విపత్తుల సమయంలో రైతులను భీమా పథకం ఆదుకుంటుందని, కావున రైతుల ఎన్రోల్‌మెంట్ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మండల, గ్రామ స్థాయి యూనిట్‌గా పంటలను నమోదు చేయాలని చెప్పారు. భీమా పథకంలో చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంట నష్టం అంచనా విషయంలో సాంకేతిక పద్ధతులను అవలంబించాలని పేర్కొన్నారు. పంటల రకాలను బట్టి భీమా వర్తింపు విధానాలను అనుసరించాలన్నారు. ఆహార, వాణిజ్య పంటలకు సంబంధించి భీమా వర్తింపుపై నూతన విధానాలను ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, సీపీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ఎల్.డి.ఎం. శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్త డా. కె. తేజేశ్వరరావు, హార్టికల్చర్ డీడీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.