నదుల అనుసంధానం వేగవంతం చేయాలి..


Ens Balu
2
Srikakulam
2021-06-15 16:14:48

శ్రీకాకుళం  జిల్లాలోని వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు.  శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలో ఉన్న వేలాది ఎకరాలకు అవసరమైన సాగునీరు అందించే అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాలని ఆకాంక్షించారు.   మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, వంశధార ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ డోల తిరుమలరావులు భేటీ అయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఇందుకుగాను ఈనెల 19న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో సాగునీటి ప్రాజెక్టుల సలహాసంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సలహాసంఘ ప్రతినిధులైన డుమా పీడి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శాసనసభ్యులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. జూలై నెలలో వంశధార కాలువల ద్వారా సాగునీటి విడుదలకు ఈ సమావేశంలో తేదీని ఖరారు చేస్తారు. ప్రస్తుతం సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క బాగా పెరిగిపోయినందున అది నీటి పారుదలకు ప్రధాన అవరోధం కాగలదని వంశధార ఎస్ఇ డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ ఉపాధిహామీ ద్వారా గుర్రపుడెక్కని తొలిగించే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కు సూచించారు.

శిధిలావస్థకు చేరిన షట్టర్లను మరమ్మత్తులు చేయడం, కొత్తవి మార్చడం వంటి పనులకు గతంలో బయటపడిన షట్టర్ల కుంభకోణం ప్రతిబంధకంగా మారిందని, ఈ స్కామ్ పై దర్యాప్తు జరిగినా, చర్యలు  పెండింగ్ లో ఉండడం వల్ల వీటికి సంబంధించి ఏ పనీ జరగడం లేదని డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉన్నతస్థాయిలో అధికారులతో మాట్లాడి తగిన క్లియరెన్స్ తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ ఏడాదిలోగా వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో 88, 87 ప్యాకేజీల పనులు, హిరమండలం రిజర్వాయర్ పని చివరిదశకు వచ్చేశాయని ఎస్ఐ తెలిపారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నారాయణపురం ఆనకట్టకు వంశధార జలాలను తీసుకువెళ్లడం.. అక్కడి నుంచి వాటిని నాగావళితో అనుసంధానం చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చర్చించారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు, వంశధార ఎడమ ప్రధానకాలువలను పటిష్టపర్చడానికి తగిన నిధులు మంజూరుకై పంచాయతీరాజ్ కమిషనర్ కె గిరిజాశంకరు లేఖరాయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కి డిప్యూటీ సీఎం ధర్మాన సూచించారు. కాలువలను మరమ్మతు చేయడం, కాలువల పనులు వెంటనే పూర్తి చేయడానికి దీనివల్ల తగిన అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం జరిగే సాగునీటి సలహా సంఘ సమావేశంలో వీటితో పాటు సాగునీటికి సంబంధించిన పలు అంశాలను చర్చించి తగిన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.