అటవీభూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలతోపాటు, వారు పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో 1,016 మంది గిరిజనులకు సుమారు 1,928.87 ఎకరాల భూమికి సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనులకు కేవలం పట్టాలను పంపిణీ చేసి వదిలేయకుండా, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుకు సాయం అందించాలని సూచించారు. పార్వతీపురం ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్ మాట్లాడుతూ, ఈ విడతలో కొమరాడ మండలంలో 120 మంది గిరిజనులకు 317.68 ఎకరాలు, కురుపాంలో 485 మందికి 965.16 ఎకరాలు, పార్వతీపురంలో 171 మందికి 200.2 ఎకరాలు, పాచిపెంటలో 72 మందికి 69.85 ఎకరాలు, జిఎల్‌పురంలో 168 మందికి 375.98 ఎకరాల అటవీభూములకు సంబంధించి సాగుహక్కు కల్పించడం జరుగుతోందన్నారు. వీరికి త్వరలో పట్టాలను అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 80వేల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను జారీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి సచిన్ గుప్త, పార్వతీపురం ఆర్‌డిఓ ఎస్.వెంకటేశ్వర్లు, ఇతర అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.