కరోనాతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ పెద్ద మరణిస్తే.. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ బుధవారం ఓ ప్రటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో బాధితులను గుర్తించి తదుపిర చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో ఎవరైనా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇంటి పెద్ద మరణించి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబ సభ్యులను గుర్తించి నివేదికలను అందించాలని మున్సిపాలిటీల, మండలాల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్.ఎస్.ఎఫ్.డి.సి.) ద్వారా అందించే ఈ రుణంలో రూ.1 లక్ష వరకు రాయితీ ఉంటుందని, మిగిలిన రూ.4 లక్షలను వాయిదాల్లో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు బాధిత కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తగిన సహాయ సహాకారాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అర్హతలు.. ఇతర ప్రక్రియ ఈ విధంగా ఉండాలి..
@ఎస్సీ కుటుంబాలకు ఆధారమైన భార్య, భర్త (18 నుంచి 60 ఏళ్ల వయసు) ఏ ఒక్కరు కరోనాతో చనిపోయినా ఈ రుణ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
@ఏడాదికి రూ. 3 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉండాలి.
@ఈ నెల 20వ తేదీ లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి.
@దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయాలకు పంపిస్తారు. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత ఈ నెల 20 తేదీ సాయంత్రం లోపు ఎస్సీ కార్పోరేషన్ ఈడీ కార్యాలయానికి పంపుతారు.
@జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర స్థాయి అధికారులకు తనిఖీకి పంపుతారు.
@అనంతరం అర్హులైన లబ్ధిదారులకు రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తారు.