ఉపాధ్యాయులకు సరుకులు వితరణ..
Ens Balu
3
Guntur
2021-06-16 13:23:14
కోవిడ్ 19 కారణంగా జిల్లాలో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్ల కు దాతలు నిత్యవసర సరుకులు అందించి ఆదుకోవడం అభినంద నీయమని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో 376 మంది ప్రైవేట్ టీచర్లకు దాతలు ద్వారా వచ్చిన, 8 రకాలైన నిత్యవసర సరుకుల కిట్ లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2020 మార్చి నెల నుంచి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడటంతో టీచర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఆదుకునేందుకు యు.ఎస్.ఎ కు చెందిన ఎన్.ఆర్.ఐ చలువాది కృష్ణ, మాధవిలు ముందుకు వచ్చి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా నిత్యవసర సరుకులను సాయం చేయడాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రశంసించారు. ఒక్కో టీచరు కుటుంబానికి రూ.1400/ విలైవ కలిగిన 10 కేజిల బియ్యం, కందిపప్పు, చింతపండు, నూనె, మినపగుళ్ళు,గోదుమ పిండి, రవ్వ,పంచదార వంటి నిత్యవసర సరుకులను కలెక్టర్ వివేక్ యాదవ్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్.ఎస్.ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు కరోనా కష్టాలు వెంటాడటంతో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటి ద్వారా దాతలు ముందుకు వచ్చి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నిత్యవసర సరుకులు సాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్ర రాజు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీవన గమనం కోవిడ్ వలన అగమ్య గోచరంగా మారిందని అన్నారు. ఇటువంటి తరుణంలో దాతలు ముందుకు వచ్చి ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్ వడ్లమాని రవి, వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు, సాహితి సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.