కోవిడ్ బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కోవిడ్ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి అందించేందుకోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన 20 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కాపు భారతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ కు సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి 10 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను, అమెరికాలోని థానా అసోసియేషన్ వారు 5 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను తీసుకుని వెళ్లి వాడుకుని మళ్లీ వెనక్కి ఇవ్వాలన్నారు. కరోనా నుంచి త్వరితగతిన బయటపడేందుకు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ అవకాశాన్ని కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను, ఆక్సిజన్ సిలిండర్ లను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రతిరోజు కరోనా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలతో బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి కోసం రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని కోవిడ్ సోకినవారు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎవరైనా ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ కావాలనుకుంటే రెడ్ క్రాస్ జిల్లా క్షేత్రాధికారి జి. రమేష్ నెంబర్ 8106733307 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మనోరంజన్ రెడ్డి, రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ ప్రసాద్, కోశాధికారి మల్లికార్జున, రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ మోహన్ కృష్ణ, రెడ్క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.