పేదలందరికి ఇళ్లు క్రింద మొదటి విడత లో మంజూరు చేసిన గృహాలన్ని ఈ నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కులు, ఏఎంసియు లు& బిఎంసియు లు, అంగన్వాడి కేంద్రాలు, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్కులు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆప్షన్ 3 ను ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్ లతో మాట్లాడి బృందాలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలన్నారు. కరోనా మూడవ దశపై ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయని, అయినప్పటికీ మూడో వేవ్ కోసం సన్నద్ధమవడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండనందున అధికార యంత్రాంగం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యం కూడదన్నారు.
రైతుకు మేలు జరగాలంటే ఈ-క్రాప్ బుకింగ్ సమర్థవంతంగా జరగాలన్నారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా ఈ-క్రాప్ బుకింగ్ ను పర్యవేక్షణ చేసి పరిస్థితి మెరుగుదిద్దాలన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగంగా జరగాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 2 వేల కిలో మీటర్ల పరిధి లో అవెన్యూ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ జరగాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున జగనన్న భూ హక్కు-భూ రక్ష క్రింద సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ, డీఆర్ఓ గాయత్రీ దేవి, సీపీవో ప్రేమ్ చంద్, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర రెడ్డి, డ్వామా పీడీ వేణు గోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.