అమూల్ కిఏర్పాట్లు పూర్తిచేయాలి..


Ens Balu
4
Anantapur
2021-06-16 14:08:05

అమూల్ ప్రాజెక్టు అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) చాంబర్లో జిల్లాలో అమూల్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమూల్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తోందని, ఈ నేపథ్యంలో అమూల్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో పాల సేకరణ సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హిందూపురం, అనంతపురం, కదిరి క్లస్టర్ లను అమూల్ ప్రాజెక్టు అమలు కోసం గుర్తించడం జరిగిందని, ఆయా క్లస్టర్ల వివరాలను అమూల్ టీం వారు హెడ్ ఆఫీస్ కి పంపించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన మూడు క్లస్టర్లలో ఏ క్లస్టర్ బాగుంటుంది అనేది అమూల్ టీం ఎంపిక చేస్తారని, ఎంపిక చేసిన క్లస్టర్ లో రూట్లు ఫైనలైజ్ అయ్యాక సంబంధిత క్లస్టర్ లోని గ్రామాల్లో మహిళా డైరీ సమాఖ్య సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాలను సేకరించడం జరుగుతుందన్నారు. అమూల్ ప్రాజెక్టు అమలు విషయమై రెండు రోజుల్లోగా సమగ్ర సమాచారం అందించాలని అధికారులను జెసి ఆదేశించారు. అమూల్ ప్రాజెక్టు అమలుపై డిఆర్డిఎ, డ్వామా, పశుసంవర్ధకశాఖ, డైరీ శాఖ, డిప్యూటీ కోపరేటివ్ ఆఫీసర్ లు కోర్ టీంగా ఉంటారని, వారందరూ సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి వెంకటేష్, డిప్యూటీ డైరెక్టర్ స్వరూపారాణి, హిందూపురం, పెనుగొండ, అనంతపురం, ధర్మవరం డిప్యూటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.