ఆలయ భూములు పరిరక్షిస్తాం..


Ens Balu
3
Visakhapatnam
2021-06-16 15:08:13

 రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేవాదాయ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేవాదాయ శాఖకు చెందిన  ఆస్తులు, భూముల ద్వారా మరింత ఆదాయం లభించే విధంగా పారదర్శకంగా ఉండే లీజు విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి శాఖ ఆధీనంలోకి తెస్తామని అన్నారు. భూములకు ఫెన్సింగ్ వేయించి ఆక్రమణలను నివారిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని భూములను కామన్ గుడ్ ఫండ్ నిధులతో లేదా అవసరమైతే పీపీపీ విధానంలో పరిరక్షిస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు నిర్వహణ పారదర్శకంగా లేదని, అకౌంట్లను ఆడిట్ చేయిస్తామని తెలిపారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆస్తుల లీజు విధానాన్ని మెరుగు పరచాలని అన్నారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, చట్టవిరుద్ధంగా ఇతరుల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ దేవాదాయ భూముల పరిరక్షణకు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బివి సత్యవతి, జి.మాధవి, విప్ బూడి ముత్యాల నాయుడు, శాసనసభ్యులు అదీప్ రాజ్, కరణం ధర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, జి.అమర్ నాథ్, ఉమా శంకర గణేష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమీషనర్ అర్జున రావు, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో లు కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, అనిత, దేవాదాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.