విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. కళ్యాణమండపాన్ని సందర్శించి శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధిచేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు. ఈఓ మంత్రికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.