కోవిడ్19 థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాలి..


Ens Balu
3
Vizianagaram
2021-06-17 06:57:57

కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ ఆర్‌. మహేష్ కుమార్ వైద్యుల‌ను ఉద్దేశించి అన్నారు. ఒక‌టి ద‌శ‌లో క‌న్నారెండో ద‌శ‌లో ఎక్కువ విపత్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నామ‌ని, ఎక్కువ న‌ష్టాల‌న చ‌విచూశామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. గ‌త రెండు ద‌శ‌ల్లో జరిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని మూడో ద‌శ‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే ఊహించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఒక వేళ‌ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాల‌నే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వ‌హించిన ఒక రోజు అవ‌గాహ‌న స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇలాంటి ముంద‌స్తు అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌టం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌కు అందించ‌బోయే వైద్య విధానంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. 18 నుంచి 45 వ‌య‌సుల వారికి, 45 నుంచి 60 ఏళ్ల వ‌య‌స్సు వారికి వ్యాక్సినేష‌న్ అంద‌జేశామ‌ని గుర్తు చేశారు. 18 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారికే ఇంకా వ్యాక్సినేష‌న్ చేయ‌లేదుకాబ‌ట్టి మూడో ద‌శ‌లో వారిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కావున పిల్ల‌ల ఆరోగ్యంపై త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని, ఒక వేళ వ్యాధి సోకితే ముందుగానే ల‌క్ష‌ణాలను గుర్తించేలా వైద్యులు అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌ను లేనిపోని అపోహ‌ల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని థ‌ర్డ్ వేవ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా వారిలో ధైర్యం నింపాల‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో డీసీహెచ్ఎస్ డా. నాగ‌భూష‌ణ‌రావు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, స్పెష‌ల్ ఆఫీస‌ర్ హ‌రికిష‌న్ కుమార్‌, డా. వెంక‌టేశ్వ‌రరావు, వివిధ విభాగాల‌కు చెందిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్యులు, న‌ర్శింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.