సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు త్వరితగతిన అందించడంలో భాగంగా నిర్మించనున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ , బల్క్ మిల్క్ సెంటర్లు త్వరితగతిన ప్రారంభించుకునే విధంగా భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లిలో రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల నిర్మాణ పనులకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో భాగంగా శాశ్వత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈ నెల 17 వ తేదీ నుండి జూలై 2 వరకు 15 రోజులు భవన నిర్మాణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛను కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద గంటల సమయం వేచియుండే పరిస్థితి ఉండేదని, అదేవిధంగా రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, తదితర సేవలకు తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే పరిస్థితులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటి ముంగిటికే అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగంగా, నాణ్యమైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చక్కటి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. చక్కటి వ్యవస్థకు శాశ్వత భవనాలను నిర్మించుకోవడం ద్వారానే మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందుతాయని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను బుక్ చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా నాణ్యత లోపాలపై ఫిర్యాదులు చేసే విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో టెస్టింగ్ సదుపాయంతో సహా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అందే అన్ని వైద్య సేవలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించి, పేమెంట్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 90 శాతం భవన నిర్మాణాలు పూర్తి కావడం జరిగిందని, భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మెటీరియల్ సరఫరా, పేమెంట్ ప్రాసెసింగ్ అంశాలలో జాప్యం ఉండదని అన్నారు. గ్రామ స్థాయిలో ఇటువంటి భవనాలు నిర్మించుకోవడం గర్వకారణమని, రాబోయే రెండు మూడు నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తూ, నాట్లు వేసే దగ్గర నుండి రైతు పండించిన పంటను అమ్ముకునే వరకూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని అన్నారు. పేదవాడి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడమే కాకుండా, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ల ద్వారా పాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం అందుతున్న సేవలు మరింత మెరుగ్గా, వేగంగా అందాలంటే భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సమన్వయంతోపనిచేసి ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని గేదెల్లంక గ్రామంలో 17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్, కొమానపల్లి గ్రామంలో 90.04 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భవన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ లతో కలిసి శంఖుస్థాపన చేయారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి, ఆర్డీవో ఎన్ ఎస్ వి బి వసంత రాయుడు, జడ్పి సిఇఓ ఎన్ వి వి సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, డ్వామా పిడి వరలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిట్టిబాబు, గేదెల్లంక, కొమానపల్లి గ్రామ సర్పంచ్ లు ఎస్. పల్లయ్య, కె.ఇందిరా, మండల అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.