భూసేకరణ వేగవంతం చేయాలి..


Ens Balu
3
Anantapur
2021-06-17 10:37:46

సోలార్ పార్కుల ఏర్పాటు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, నేషనల్ హైవే కింద చేపడుతున్న  రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి సోలార్ పార్కులు, టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు సంబంధించి, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ విషయమై జిల్లాలోని ఆర్డీఓ లు, తహశీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపు భూ సేకరణ పూర్తిచేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. కంబదూరు మండలంలో చేపడుతున్న సోలార్ పార్కుకు సంబంధించి భూసేకరణ చేపట్టి పంపించిన ప్రతిపాదనల మీద లీజ్ అగ్రిమెంట్ లను వెంటనే పూర్తిచేయాలని, ఈ విషయమై సోలార్ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ముదిగుబ్బ, కంబదూరు మండలాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కులకు సంబంధించి భూసేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారని, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నారు.

 హెచ్ఎన్ఎస్ఎస్ కింద చేపడుతున్న తోపుదుర్తి రిజర్వాయర్ కు సంబంధించి బండ్ పోర్షన్ పనులను జూలై నెల ఆఖరి కల్లా పూర్తి చేయాలన్నారు. దేవరకొండ రిజర్వాయర్ బండ్ పోర్షన్ పనులను జూలై 15 లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ముట్టాల రిజర్వాయర్ కు సంబంధించి జూలై నెలాఖరుకల్లా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ లకు సంబంధించి భూసేకరణ డిక్లరేషన్ ప్రతిపాదనలు వేగంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

చిలమత్తూరు మండలంలోని టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియా (ఎస్ఈజెడ్)కు సంబంధించి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని చిలమత్తూరు తహసీల్దార్ ను జేసీ ఆదేశించారు. టేకులేడు ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి రోడ్ విస్తరణకు కూడా భూసేకరణ చేయాలన్నారు. పది రోజుల్లోగా గుర్తించిన భూమికి సంబంధించి డాక్యుమెంట్ పరిశీలన చేయాలని ఏపీఐఐసీ జెడ్ఎంకు సూచించారు. అలాగే నేషనల్ హైవే కింద చేపడుతున్న ఎన్ హెచ్ 42 రహదారి, కదిరి బైపాస్ రోడ్డు, కళ్యాణదుర్గం - రాయదుర్గం మద్యం వేస్తున్న నేషనల్ హైవే 544 డిడి తదితర వాటికి సంబంధించి భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జెసి ఆదేశించారు. హెచ్ఎల్సీ కింద పిఏబిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూసేకరణ పనులు చేపట్టాలన్నారు. భూసేకరణ పనులు పూర్తి చేయడం వల్ల ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతాయని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయమై తహశీల్దార్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ గాయత్రీ దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, రవీంద్ర, నేషనల్ హైవేస్ ఎస్ ఈ మురళీమోహన్, ఎన్ హెచ్ఏఐ పిడి మీనా, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, ఆర్అండ్బీ అధికారులు, వివిధ శాఖల ఈఈలు, డిఈ లు తదితరులు పాల్గొన్నారు.