క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..


Ens Balu
2
Guntur
2021-06-17 11:41:05

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా జరిగినప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం  గుంటూరు నగరపాలక సంస్థ శివారున ఓబులునాయుడు పాలెం లోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరక్టర్  ఎం మల్లిఖార్జున నాయక్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ప్లాంట్లోని టిప్పర్ ఫ్లోర్, బాయిలర్ ఏరియా, టర్బైన్ కంట్రోల్ రూం ప్రాంతాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిందాల్  వేస్ట్ ఎనర్జీ  ప్రాజెక్టు వివరాలను జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్  లిమిటెడ్ ప్రాజెక్టు ప్రెసిడెంట్ ఎంఎం చారి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు అధికారులకు వివరించారు. ప్లాంట్ నిర్మాణం, మిషనరీ ఏర్పాటు పనులు నూరు శాతం పూర్తి అయ్యాయని, విద్యుత్ సబ్ స్టేషన్ కు అనుసంధానం పనులు, నీటి సౌకర్యం కల్పిస్తే 20 రోజులలో ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువస్తామని ఎంఎం చారి తెలిపారు. దీనిపై మంత్రి బోత్స సత్యనారాయణ స్పందిస్తూ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు వారంలో పూర్తి చేయాలని, నీటి సౌకర్యంకు సంబంధించి పైపులైను పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు అవసరమైన వ్యర్ధాలను పూర్తి స్థాయిలో సెగ్రిగ్రేషన్ చేసి అందించేందుకు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ అధికారులు మున్సిపాల్టీలలోని క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి గృహాలలోనే సెగ్రిగ్రేషన్ జరిగేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ  వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జిందాల్ సంస్థతో  18 నెలల్లో ప్లాంట్ను ప్రారంభించేలా ఎంవోయు చేసుకుందన్నారు. గుంటూరు, విజయవాడతో పాటు 9 మున్సిపాల్టీలలో వ్యర్ధాలను ఇక్కడికి తీసుకువచ్చి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారన్నారు. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 10 శాతం మాత్రమే ప్లాంట్ పనులు జరిగాయన్నారు. అప్పటి నుంచి ప్లాంట్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవటంతో ప్రస్తుతం పనులు పూర్తి అయ్యి ప్రారంభ దశకు చేరుకుందన్నారు. ప్లాంట్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పరిష్కరించేందుకు మున్సిపల్, ఇంజనీరింగ్, విద్యుత్ రాష్ట్రస్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్లాంట్ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. 

ప్లాంట్కు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సబ్ స్టేషన్ అనుసంధాన పనులు పెండింగ్లో ఉన్నాయని వీటిని పదిహేను రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో ప్లాంట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి మున్సిపాల్టీల నుంచి సేకరించిన వ్యర్ధాల ద్వారా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో గంటకు 15 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందన్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను ప్రభుత్వం రూ.6.12 పైసలకు కొనుగోలు చేస్తుందన్నారు. గుంటూరుతో పాటు విశాఖ పట్ణణంలోను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా లేదా వర్చువల్ విధానంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్లాంట్ వలన పర్యావరణానికి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందన్నారు. జిల్లాలోని డోర్ టూ డోర్ వ్యర్ధాల సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా 720 వాహనాలు అందించటం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచనల మేరకు ప్లాంట్ పరిధిలోని 5 కీమీ లోపు ఉన్న గ్రామాల నుంచి సేకరించిన వ్యర్ధాలను సైతం ఇక్కడకు తరలించే అంశంను పరిశీలిస్తామన్నారు.

 ప్లాంట్కు అవసరమైన 0.15 ఎంఎల్డీ నీటిని సమీపంలోని వెంగళాయ పాలెం గ్రామం నుంచి పైపులైను ద్వారా సరఫరా చేయటం జరుగుతుందన్నారు. వెంగళాయపాలెంలో నగరపాలక సంస్థకు చెందిన 2.5 ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ ఉందని, అక్కడి గ్రామ ప్రజలకు అవసరమైన నీటిని పూర్తి స్థాయిలో అందించిన తర్వాతే ప్లాంట్కు నీటి సరఫరా చేస్తామన్నారు. వెంగళాయపాలెం గ్రామం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గంలో ఉన్నందున మంత్రి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నగరపాలక సంస్థ, పంచాయితీ అధికారులు గ్రామ ప్రజలతో చర్చించి వారికి ఇబ్బంది కలగకుండా ప్లాంట్కు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో మిగిలిన యూజీడీ పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఆవరణలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్ధాళి గిరిధర్, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు, నరసరావు పేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చంద్రయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, నరసరావుపేట కమిషనర్ రామచంద్రారెడ్డి, సత్తెనపల్లి కమిషనర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరు దాసరి శ్రీనివాసరావు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, పశ్చిమ మండల తహశీల్దారు మోహనరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు బాల వజ్ర బాబు,  జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏజీఎం రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.