రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడంలో జిల్లా నెంబర్‌వన్‌గా వుంటోందని, బ్యాంకుల సహకారంతో అమలు చేసే పథకాల్లోనూ జిల్లా మొదటి స్థానంలో నిలిచేందుకు వీలుగా బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాల్సి వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన జిల్లా అయినందున వ్యవసాయ, ఆధారిత రంగాలైన పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాటికి రుణాలు అందజేయాలని బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వాలని భావిస్తోందని, దీనిలో భాగంగా జిల్లాలో 34 వేల మందికి సి.సి.ఆర్.సి. కార్డులు ఇస్తున్నామని వారందరికీ పంటరుణాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రూ.1861 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇప్పటివరకు రూ.732 కోట్లు ఇచ్చారని, మిగిలిన వారికి కూడా వెంటనే రుణాలు మంజూరు చేయడం ద్వారా రైతులందరికీ సకాలంలో పంటకు అవసరమైన పెట్టుబడి అందించడానికి చర్యలు చేపట్టాలని బ్యాంకులను కలెక్టర్ కోరారు. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి తోడుగా పాడిపరిశ్రమ, గొర్రెలు లేదా మేకల పెంపకం వంటి అదనపు ఆదాయం సమకూరే మార్గాలను చూపడం ద్వారా రైతుల ఆదాయం రెండింతలు అయ్యేలా చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. పాడిపరిశ్రమ రంగంలో ఈ జిల్లాకు మంచి భవిష్యత్ ఉందని, రాష్ట్రంలో చిత్తూరు తర్వాత పాడిపరిశ్రమలో ఆ స్థాయిలో నిలిచేది విజయనగరం మాత్రమేనని చెప్పారు. ఈ రంగానికి బ్యాంకులు సహకారం అందించి చేయూత పథకం కింద యూనిట్ల మంజూరుకు సహకరించాలన్నారు. పశుసంవర్ధక శాఖ, డి.ఆర్.డి.ఏ. అధికారులు కూడా బ్యాంకులను నిత్యం సంప్రదిస్తూ జిల్లాకు మంజూరైన యూనిట్లన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేసి వచ్చే డిసిసి సమావేశం నాటికి ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించి జిల్లాను రెండోస్థానంలోకి తీసుకు రావాలని ఆదేశించారు.
జగనన్న తోడు యూనిట్ల ఏర్పాటులోనూ బ్యాంకర్లు జిల్లా అధికారులకు సహకరించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. పట్టణాల్లో ఈ పథకం కింద రుణాలు ఆశించిన మేరకు అందించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఇచ్చారని, ఆ లోటు లేకుండా చూడాలని చెప్పారు.
జిల్లా గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనపై నూతన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీనివాస్ నివేదిస్తూ పంటరుణాల మంజూరులో గత ఏడాది 97.16శాతం లక్ష్యాలను సాధించామని, వ్యవసాయ టెర్మ్ రుణాల మంజూరులో జిల్లా గత ఏడాది 128.14శాతం లక్ష్యాలను సాధించిందని, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలకు రుణాల మంజూరులో 50.52శాతం లక్ష్యాలను సాధించినట్లు వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పరిశ్రమల శాఖ ద్వారా ఈ ఏడాది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, సంబంధిత యూనిట్ల ఏర్పాటులో లక్ష్యాలను సాధించాలని స్పష్టంచేశారు.
నబార్డు ఏ.జి.ఎం. హరీష్ మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకే 40శాతం తగ్గకుండా రుణాలు ఇవ్వాల్సి వుంటుందన్నారు. ప్రతి బ్యాంకు తమ పరిధిలో ఎస్.సి., ఎస్.టి., మహిళలకు కనీసం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏడాదిలో ఒక్క యూనిట్ అయినా మంజూరు చేయవలసి వుంటుందన్నారు. జిల్లాలోని భారతీయ స్టేట్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి శిక్షణ సంస్థకు ఏ ప్లస్ గ్రేడింగ్ వచ్చిందని శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి అధికారి వివరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డి.ఆర్.డి.ఏ. ఏపిడి సావిత్రి, బి.సి.కార్పొరేషన్ ఇ.డి. జి.జగన్నాధరావు, బి.సి.కార్పొరేషన్ ఇ.డి. నాగమణి, మెప్మా పిడి సుధాకర్, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోట ప్రసాదరావు, ఉద్యానశాఖ డి.డి. శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ డి.డి. అన్నపూర్ణ, పశుసంవర్ధక శాఖ జె.డి. రమణ తదితరులు పాల్గొన్నారు.