కరోనా కారణంగా బీసీ, ఎస్సీ కుటుంబాలలో సంపాదించే వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించిన ప్రక్రియను సమన్వయంతో నిర్వహించాలని జేసీ జె. వెంకటరావు అధికారులను ఆదేశించారు. జీవనాధారం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బాధిత కుటుంబీకులను గుర్తించే ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని సూచించారు. సంబంధిత దరఖాస్తులను ఆయా మండల, మున్సిపల్ కేంద్రాలకు అందజేయాలని చెప్పారు. రుణ మంజూరు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే నిమిత్తం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జేసీ గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీసీ కార్పోరేషన్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీలతో కలిపి నిర్వహించిన ఈ సమావేశంలో రుణ మంజూరు ప్రక్రియకు సంబంధించిన అంశాలను వివరించారు. అర్హతలు, నిబంధనలు తెలియజేశారు. నిర్ణీత గడువులోగా బాధిత కుటుంబీకుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని, ఇతర ప్రక్రియలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కాన్ఫరెన్స్‌లో బీసీ కార్పోరేషన్ ఈడీ నాగరాణి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ జగన్నాధరావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
అర్హతలు.. ఇతర నిబంధనలు
@బీసీ, ఎస్సీ కుటుంబాలకు ఆధారమైన భార్య, భర్త (18 నుంచి 60 ఏళ్ల వయసు) ఏ ఒక్కరు కరోనాతో చనిపోయినా ఈ రుణ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
@ఏడాదికి రూ. 3 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉండాలి.
@ఎస్సీ వర్గానికి చెందిన వారు ఈ నెల 20వ తేదీ లోపు, బీసీ వర్గానికి చెందిన వారు ఈ నెల 23వ తేదీ లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి.
@పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తారు.
@రాయితీ రూ.1 లక్ష వరకు ఉంటుంది.