కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఒక వైద్యుడు తయారుగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. కోవిడ్ వైద్యం, మందులు, నివరణా పద్ధతుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఒకటో దశలో కన్నా రెండో దశలో ఎంతో మందిని కోల్పోయామని, 3వ దశ లో ఆ పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. రెండు దశల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మూడో దశలో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఒక వేళ పిల్లలకు కరోనా సోకితే ఎలాంటి వైద్యం అందించాలనే అంశంపై మిమ్స్‌లో గురువారం నిర్వహించిన ఒక రోజు అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి కాలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, పిల్లలకు అందించబోయే వైద్య విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 3వ దశ లో పిల్లలకు వ్యాధి సోకే అవకాశం ఉందని, ముందుగానే లక్షణాలను గుర్తించేలా వైద్యులు అందరిలో అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ థర్డ్ వేవ్ అకస్మాత్తుగా రావచ్చని, వేగంగా విస్తరించవచ్చని, ఎక్కువ కేసు లు నమోదయ్యే అవకాశం ఉండొచ్చని, అప్రమత్తత అవసరమని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 6 లక్షల మందికి వాక్సినేషన్ వేయడం జరిగిందని, వచ్ఛే నవంబర్ లోగా 18 లక్షల మందికి వాక్సినేషన్ వేయడానికి ప్రణాళికలు వేసామన్నారు. ప్రజలు భయన్దోళనలకు గురి కాకుండా వారిలో మనో ధైర్యాన్ని నింపాలని అన్నారు. ముఖ్యముగా పిల్లల తల్లి దండ్రులకు అవగాహన కలిగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. నాగభూషణరావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డా.అప్పల రాజు, ఆర్.ఎం.ఓ డా.గౌరి శంకర రావు, మిమ్స్ డైరెక్టర్ డా. భాస్కరరాజు, స్పెషల్ ఆఫీసర్ డా. హరికిషన్ కుమార్, డా. వెంకటేశ్వరరావు, డా.శాంతి, పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు, నర్శింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.