అనంతపురం జిల్లాలో ఈ క్రాపింగ్ 100% నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలకు ఆస్కారం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలన్నారు. . విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎకరంలోని పంట వివరాలు ఈ క్రాపింగ్ లో నమోదు చేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాల పై రైతులకు అవగాహన చేపట్టేలా మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ క్రాపింగ్ నిర్వహించే ఉద్యోగులకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణం పనులను వేగవంతంగా పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని త్వరిత గతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారమే సమగ్ర విచారణ జరిపి త్వరిత గతిన నివేదిక అందించి రైతు కుటుంబాలకు ఆసరా కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో బ్యాంకులకి సంబంధించిన అడ్వైజర్ కలిగే ఉండేవిధంగా వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ శాఖలు వారివారి శాఖలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, ఉద్యాన శాఖ డీడీ సతీశ్, ఏపీ ఎమ్.ఐ.పీ పీడీ ఫిరోజ్ ఖాన్, పట్టు పరిశ్రమ జేడీ పద్మావతి, పశుసంవర్థక శాఖ వై.వేకంటేశు మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.