వైయస్సార్ చేయూత మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వైయస్సార్ చేయూత పథకంకు శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకర్లు సహాయంతో దాదాపు అన్ని యూనిట్లకు ప్రాథమిక రుణ మంజూరు జరిగిందని అన్నారు. ఈ రుణాలను పూర్తి స్థాయిలో ఈ నెల 23వ తేదీ నాటికి మంజూరు చేసి చేయూత పోర్టల్ లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రుణాలు మంజూరు చేయడం వలన వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు ప్రయోజనం ఉంటుందని, ఎటువంటి అలసత్వం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. జగనన్న తోడు, టిడ్కో గృహ పథకాలకు ఋణాలు మంజూరు చేయాలని ఆయన పేర్కన్నారు. గత సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలలో 68 శాతం సాధించడం జరిగిందని ఆయన అన్నారు. రు. 6900 కోట్లకు గాను రూ. 4,692 కోట్లు వ్యయం చేయడం జరిగిందని చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల క్రింద తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులో లబ్ధిదారులు సుముఖంగా ఉండాలని, తిరిగి చెల్లింపులపై ప్రభుత్వ అధికారులు బ్యాంక్ లకు సహకారం అందజేయాలని ఆయన సూచించారు. ఆధార్ కేంద్రాలు, బ్యాంకుల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారని దానిని అరికట్టాలని కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్ మాట్లాడుతూ 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు నిర్వహించిన వ్యాపార ఫలితాలను పరిశీలిస్తే మొత్తం డిపాజిట్లు రూ. 11,833.26 కోట్లు కాగా మొత్తం రుణాలు రూ. 13706.06 కోట్లు అని చెప్పారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 68 శాతం ఫలితాలు సాధించడం జరిగిందని దీనిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగంలో 70 శాతం, రూ. 5,715 కోట్లలో రూ.4,004 కోట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించి 80 శాతం, రూ.4174 కోట్లలో రూ.3,300 కోట్లు, ఎం.ఎస్.ఎం.ఇ రుణాలలో 66.36 శాతం, రూ.890.30 కోట్ల లక్ష్యంలో రూ.591 కోట్లను అందించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, డిసిసి కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కే.కృష్ణయ్య, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ , డిఆర్డిఎ పిడి బి.శాంతిశ్రీ , ఎస్బిఐ రీజినల్ మేనేజర్ తపోధన్ దేహరి, ఏపీజివిబి రీజినల్ మేనేజర్ రియాజ్, డిసిసిబి సీఈఓ డి.సత్యనారాయణ, సహాయం ఎల్.డి.ఎం ఎన్.వి.రమణ, లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కే.గిరిజాశంకర్ పాల్గొన్నారు.