శ్రీకాకుళంజిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2021–2022 విద్యా సం.లో 5వ తరగతి మరియు ఇంటర్ ప్రధమ సంవత్సరం నందు ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సమన్వయకర్త వై.యశోధలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేసారు. 5వ తరగతి మరియు నీట్ ఐఐటి అకాడమీలందు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ( ఇంగ్లీష్ మీడియం ) ప్రవేశాలకు చేరగోరు బాలురు, బాలికలు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షా ఎంపిక ద్వారా ప్రవేశాలు జరుగుతాయని, ఆసక్తి గల విద్యార్ధులు నేటి నుండి జూలై 7వ తేదీలోగా ఆన్ లైన్ నందు సమర్పించాలని చెప్పారు. 5వ తరగతి ప్రవేశాల కొరకు http://apgpcet.apcfss.in/ వెబ్ సైటు నందు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం కొరకు http://apgpcet.apcfss.in/Inter/వెబ్ సైటు నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జూలై 7 తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవని, దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. ఒక విద్యార్ధి ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న తదుపరి ఎటువంటి మార్పులు చేయుటకు అవకాశం ఉండబోదని, కావున విద్యార్ధులు దీన్ని గమనించాలని కోరారు. ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన మార్కులు ఆధారంగా సీట్లు కేటాయించబడతాయని, ప్రవేశ పరీక్ష తేదీని దరఖాస్తుదారుల రిజిష్టర్ మొబైల్ నెంబరుకు మెసేజ్ రూపంలో గాని, పత్రికా ప్రకటన ద్వారా గాని తెలియజేయబడుతుందని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.
గురుకుల విద్యాలయాల్లో యస్.సి విద్యార్ధులకు 75 శాతం, యస్.సి ( కన్వెర్టడ్ క్రిస్టియన్ ) వారికి 12 శాతం, యస్.టి విద్యార్ధులకు 6 శాతం అలాగే బి.సి విద్యార్ధులకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకునే యస్.సి., యస్.టి విద్యార్ధులు 2008 సెప్టెంబరు 1 నుండి 2012 ఆగష్టు 31 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఓ.సి,బి.సి, యస్.సి (కన్వెర్టడ్ క్రిస్టియన్ ) , బి.సి-సి విద్యార్ధులు 2010 సెప్టెంబరు 1 నుండి 2012 ఆగష్టు 31 మధ్య జన్మించిన వారై ఉండాలని ఆమె స్పష్టం చేసారు. విద్యార్ధులు స్వంత జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, సంబంధిత జిల్లాలో 2019-20 విద్యా సం.లో 3వ తరగతి మరియు 2020-21లో 4వ తరగతి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలన్నారు. ఆదాయ పరిమితి రూ.1,00,000/-లకు మించి ఉందరాదని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.
ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారి కార్యాలయ సిబ్బందికి గాని లేదా తమ సమీప సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను గాని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.