గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ఫీవర్ సర్వేలను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించేలా చూడాలని అధికారులను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి.. వర్చువల్ విధానంలో జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, పథకాల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు సచివాలయాల స్థాయిలో వాలంటీర్లు, ఆశాలు ఫీవర్ సర్వేను నిర్వహించి, వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించాలన్నారు. ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం చూపిన 33 మంది వాలంటీర్లను ఇప్పటికే తొలగించామని.. అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ విపత్తుకు సంబంధించి ఏ చిన్న నిర్లక్ష్యమైనా పెద్ద సమస్యకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, ఫీవర్ సర్వే సమర్థవంతంగా జరిగేలా చూడాలని, ఈ నెలాఖరుకు పాజిటివిటీ రేటును ఒకటి కంటే తక్కువకు పరిమితం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. రోజుకు పదివేల పరీక్షలను ఫోకస్డ్‌గా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిరంతర పరిశీలనలు కొనసాగించాలని.. బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని నోడల్ ఆఫీసర్లకు సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద పూర్తిస్థాయిలో సేవలందేలా చూడాలని, నాన్ ఆరోగ్యశ్రీ విషయంలో ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు.
మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న సూచనల నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతతో ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు, శిక్షణ ప్రక్రియకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పక్షోత్సవాలను విజయవంతం చేయాలి:
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్ల శాశ్వత భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసే లక్ష్యంతో జూన్ 17 నుంచి జులై 2 వరకు నిర్వహిస్తున్న భవన నిర్మాణ పక్షోత్సవాలను ప్రణాళిక ప్రకారం విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల సహకారంతో జూన్ చివరినాటికి 100 శాతం గ్రౌండింగ్ పూర్తయ్యేలా చూడాలని.. ఎప్పటికప్పుడు పూర్తయిన భవనాలకు ప్రారంభోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ప్రతిపాదనలు రూపొందించి, పంపాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా చేపట్టేలా చూడాలని.. హౌసింగ్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి, లబ్ధిదారులకు అందుబాటులో ఉండి గ్రౌండింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ సన్నద్ధతకు సంబంధించి ఆర్‌బీకేలలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూడాలని.. ఆర్‌బీకేలు రైతులకు వన్‌స్టాప్ కేంద్రంగా ఉండాలనే విషయాన్ని గుర్తించి, సేవలందించాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ-క్రాప్ బుకింగ్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చి, 100 శాతం నమోదు లక్ష్యంగా పనిచేయాలన్నారు. పంట ప్రణాళిక, వైవిధ్యంపై సలహా బోర్డుల సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. 343 రైతు గ్రూపులకు రూ.15 లక్షల చొప్పున ప్రాజెక్టు వ్యయంతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో, పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పంటసాగుదారు హక్కు కార్డుల (సీసీఆర్‌సీ) జారీకి సంబంధించి గతంలో జారీచేసిన లక్ష కార్డులకు అదనంగా ఈసారి మరో రెండు లక్షల కార్డులను జారీచేసి జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేయాలని సూచించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల లేఅవుట్లలో లెవిలింగ్ పనులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంగా అమలాపురం, రామచంద్రాపురం డివిజన్లు యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. అదే విధంగా ఖరీఫ్ సన్నద్ధత, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి కొత్తగా సేకరించాల్సిన భూమి తదితరాలపై జేసీ అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలు; సచివాలయాల వారీగా ఫీవర్ సర్వేలు, క్లినిక్‌ల నిర్వహణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సూచనలు చేశారు. వైఎస్సార్ చేయూత, బీమా తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రస్తుతం సచివాలయాల స్థాయిలో చేయాల్సిన పనులతో పాటు భవన నిర్మాణాల పక్షోత్సవాలపై జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి సమావేశంలో వివరించారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, జేడీ (ఎ) ఎన్.విజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, ఎస్ఈ పీఆర్ బీఎస్ రవీంద్ర, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.