రైతులకు సమాచారం అందించండి..


Ens Balu
2
Srikakulam
2021-06-17 13:47:10

శ్రీకాకుళం జిల్లాలో  ఖరీఫ్ సీజనుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు  రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతుందని, ఈ సమాచారాన్ని రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని  సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ శాఖాధికారులు, మండల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మండల తహశీల్ధారులు, మండల వ్యవసాయాధికారులతో ఆయన వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేసి డా.వై. యస్.ఆర్.ఉచిత పంటల బీమా పథకంపై రైతులు వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతీ రైతు ఇ - పంటలో నమోదయ్యేలా చూడాలని, ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వం అందించే నష్టపరిహారం, ఆర్థిక సహాయక కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా భూముల్లో పండించే పంటల వివరాలను తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ మండలంలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసినప్పటికీ జిల్లాలో కంచిలి, కవిటి, పాలకొండ, రాజాం, శ్రీకాకుళం మండలాలు కొంతమేర గ్రామసభలు నిర్వహించారన్నారు. మిగిలిన మండలాలు త్వరితగతిన పూర్తిచేయాలని, రానున్న వారం రోజులు విస్తారంగా గ్రామసభలు నిర్వహించి రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజనుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీచేయబడుతుందని   ఈ విషయాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు. స్వంత భూమి కలిగిన రైతులే కాకుండా కౌలురైతులకు ఇది వర్తిస్తుందని, ఈ విషయాన్ని కూడా కౌలు రైతులకు చేరవేయాలన్నారు.  ఇ – క్రాప్ నమోదులో ఆన్ లైన్ లో తలెత్తిన సమస్యలను జె.సి దృష్టికి తహశీల్ధారులు తీసుకురాగా వాటిని టెక్నికల్ సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీఇచ్చారు.

          ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.