మహావిశాఖ నగర పాలక సంస్థలో అధికారులు హడావిడి, భూ ఆక్రమణల గుర్తింపు, వార్డు సచివాలయ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సులకే సమయమంతా సరిపెట్టేస్తున్నారు.. రెండు, మూడేళ్లు సర్వీసు పూర్తయినా ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఇక్కడే తిష్టవేసుకొని కూర్చొంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సొంత ప్రయోజనాలకోసం సీటు కదల కుండా కూర్చోవడానికి వెచ్చించిన సమయం ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిన దాఖాలు ఎక్కడా కనిపించలేదనే విషయంలో కౌన్సిల్ ఏర్పాటైన తరువాత కార్పోరేటర్లు లేవనెత్తిన సమస్యలే సాక్ష్యాలుగా మారుతున్నాయి. అంతేకాదు రాష్ట్రప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను నగరపాలక సంస్థకు అనుసంధానం చేసినా నగరంలో పన్నుల వసూళ్లు పాత పద్దతి మాత్రమే అంతంత మాత్రంగానే వసూలవుతున్నాయి. వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన సమయం మొత్తం అధికారుల వీడియో కాన్ఫరెన్సు సమావేశాలకే కేటాయిస్తే ఇక వారు ప్రజలకు సేవలందించే సమయెక్కడిది అనేది ఉద్యోగుల భావన.. ఈ విషయాన్ని ఆయా వార్డుల కార్పోరేటర్ల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నా సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాని ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేసే సమయం ఎక్కడుంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంకా ఏదైనా సమయం వుంటే ఉదయం జివిఎంసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ పర్యటనల్లోనే ఉదయం సగం సమయం అంతా అయిపోతుందని వాపోతున్నారు.. జివిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి నవంబరు వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సమయంలో జీవిఎంసీ నగరంలో ఏ స్థాయిలో ప్రజలకు సేవలు అందించింది.. ఎన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు..ఇంకా ఎన్ని సౌర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు..ఈ ఆఫీస్ ఏ స్థాయిలో పనిచేస్తుంది.. ఎంత బకాయి పన్నులు వసూలు చేసిందిందీ అనే విషయాన్ని లెక్కలు వేస్తే ఏమీకనిపించని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మళ్లీ జీవిఎంసీ ప్రధాన కార్యాలయాలనికే వచ్చి పరిస్థితి వుంది. కొన్ని చోట్ల ఇంటి పన్ను కట్టడానికి ప్రజల ముందుకి వస్తున్నా..వారికి అనుకూలంగా అనుకున్న మొత్తం కమిషన్లుగా రాలేదనే సాకుతో వారి నుంచి పన్నులు కట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.. కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్ల పర్యటనలో గుర్తించిన సమస్యలు ఎన్నింటికి పరిష్కారం చూపారనే విషయంలో కూడా ఇక్కడి అధికారుల వద్ద జాబితా లేనట్టే కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారితే కోరుకున్న స్థానాలు కదిలిపోకుండా పైరవీలు చేసుకొని కూర్చున్న సీటునే ఏళ్ల తరబడి అంటిపెట్టుకొని ఉండటానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. అదేమంటే ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలన్నీ ఎంతో కష్టపడి చేరుస్తున్నామని కాస్త గంభీరంగానే చెబుతున్నారు. అదీ కూడదంటే జీవిఎంసీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలకు ఖండనలు ఇస్తూ చేతులు దులిపేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అలాగని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడంలో తేడాలు వస్తున్నాయంటే..విధి నిర్వహణ కోసం కేటాయించే సమయం కంటే వీరి ప్రసన్నం కోసం, ఉన్నసీటు కదిలపోకుండా చూసుకోవడానికే సమయం అధికంగా వెచ్చిస్తున్నారనేది ఇటీవల జరిగిన అధికారుల బదిలీలే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా జివిఎంసీ అధికారులు ప్రజా సమస్యలపై ద్రుష్టిపెడితే బావుంటుందనేది నగరవాసుల మాట..మరి పట్టించుకుంటారో లేదో చూడాల్సిందే..!