కుల ధృవీకరణ పత్రాల జారీ వేగవంతం చేయాలి..


Ens Balu
4
Vizianagaram
2021-06-18 10:34:26

ఎస్.సి. ఎస్.టి ల పై నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి కుల ధృవీకరణ పత్రాలను వేగంగా జారీ చేయాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె. వెంకట రావు తెలిపారు.  ఆ మేరకు మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శుక్రవారం  జూమ్  కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన  జిల్లా  విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ  సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.   ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ గత సమావేశం లో సభ్యులు కుల ధ్దృవీకరణ పత్రాల జారీ ఆలస్యం కావడం వల్లనే కేసుల పరిష్కారం ఆలస్యం అవుతోందని కమిటీ దృష్టి కి తెచ్చిన దృష్ట్యా ఆర్.డిఓ , సబ్ కలెక్టర్ ,ఎం.ఆర్.ఓ లకు సూచనలు జారీ చేయడమైందన్నారు.   సమావేశం లో సభ్యులు వివరించిన సమస్యలను సత్వరమే పరిష్కారం జరిగేలా  అధికారులు చూడాలని,  తీసుకున్న చర్యలను తిరిగి సభ్యులకు తెలియజేయాలని అన్నారు. 
ఎస్.సి., ఎస్.టి కేసులకు  60 రోజుల్లో పరిష్కారం:    జిల్లా ఎస్.పి రాజ కుమారి ఎస్.సి. ఎస్.టి ల పై నమోదైన కేసులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించడం జరుగుతోందని, 60 రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు  తీసుకోవడం జరుగుతోందని ఎస్.పి రాజకుమారి తెలిపారు.  ఐతే ఎక్కువగా తప్పుడు కేస్ లు నమోదవుతున్నాయని,  సంఘాల సభ్యులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని కోరారు. వాస్తవ బాధితులకు త్వరగా   న్యాయం జరగాలంటే బోగస్ కేస్ లు తగ్గాలని అన్నారు. 
ఈ సమావేశం లో  సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు  సునీల్ రాజ్ కుమార్,  అదనపు ఎస్.పి సత్యరాయణ రావు,  , డి.ఎస్.పి లు మోహన రావు, శ్రీనివాస రావు,  జిల్లా అధికారులు , ఎస్.సి, ఎస్.టి ప్రతినిధులు పాల్గొన్నారు.   తొలుత కోవిడ్ తో మరణించిన సభ్యులు పుష్పనాధం మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.