రాష్ట్రంలో భూతగాదాలు, భూసంబంధ సమస్యలు శాశ్వతంగా పరిష్క రించడం ద్వారా ప్రజలు భూసమస్యల కారణంగా ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకూడదనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్.జగనన్న భూహక్కు భూరక్ష పేరుతో సమగ్ర భూసర్వేకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో భూసర్వే జరిగిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు భూసర్వే జరగలేదని దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. స్పష్టమైన భూరికార్డులు ఏర్పరచడం ద్వారా భూముల అసలు యజమానులకు వాటిపై పూర్తిస్థాయి హక్కులు కల్పించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావులేని విధంగా వాటికి రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని చెప్పారు. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. 2023 అక్టోబరు నాటికి సమగ్ర భూసర్వే పూర్తిచేయడానికి గడువుగా నిర్ణయించామన్నారు. పటిష్టమైన రీతిలో సర్వే జరిగేందుకే మూడేళ్ల కాలవ్యవధిని నిర్ణయించామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించి భూముల ఛాయాచిత్రాలు తీసి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఎంతో ఖచ్చితంగా భూముల హద్దులను నిర్ణయిస్తారని చెప్పారు. సమగ్ర భూసర్వేలో కేవలం వ్యవసాయ భూములకు సంబంధించి మాత్రమే కాకుండా నివాస స్థలాలు, ప్రభుత్వ భూములు, పట్టణాల్లోని నివాస స్థలాలకు సంబంధించి కూడా సర్వే జరిపి సమగ్రమైన రికార్డులు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సర్వేపై రైతుల్లో ఉన్న అపోహలను, అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తారని, ఆ సభల్లో తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లో ఈ సర్వే జరుగుతున్న సమయంలో రైతులంతా సర్వే గురించి తెలుసుకొని ఇందులో భాగస్వాములు కావడం ద్వారా సర్వేకు సహకరించాలన్నారు. జిల్లాలో ఈ సర్వే జరుగుతున్న తీరుపట్ల రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని ముఖ్యమంత్రి తన సుదీర్ణ పాదయాత్రలో రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధ వివాదాల సమస్యలు తెలుసుకున్న మీదట భూ సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న కారణంగా పొరపాట్లకు ఆస్కారం లేకుండా సర్వే జరుగుతుందన్నారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మర్రివలసలో వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ టెక్నాలజీతో గ్రామానికి సంబంధించి తీసిన ఛాయాచిత్రాలను వారు ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్యలతో కలసి తిలకించారు. భూముల సర్వేలో భాగంగా వినియోగించే కోర్స్ రోవర్స్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, ఇ.టి.ఎస్. పరికరాలను మంత్రులు తిలకించారు. అవి ఈ సర్వేలో ఏవిధంగా ఉపయోగపడనున్నాయో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ వారికి వివరించారు.
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రైతులు, భూ యజమానులు తమ జీవిత కాలంలో కష్టపడి సంపాదించిన భూములను వేరొకరు తప్పుడు రికార్డులు సృష్టించి వాటిపై వివాదాలు సృష్టిస్తున్న పరిస్థితుల్లో వారు ఈ వివాదాల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి వుందని, ఇటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ ఈ సమగ్ర భూసర్వే కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అసలైన భూయజమానులకు న్యాయం జరుగుతుందని పేర్కొంటూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఖాళీ భూములపై కొందరు దళారులు తప్పుడు రికార్డులు సృష్టించి వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వాటికి ఈ సర్వే చెక్ పెడుతుందన్నారు. తల్లికి బిడ్డపై ఎంతటి మమకారం ఉంటుందో రైతుకు కూడా తన భూమిపై అంతటి మమకారం ఉంటుందని, అటువంటి భూమి ఇతరుల పాలైతే ఎంతో మనోవ్యధ చెందుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16వేల మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, ఎంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించి ఈ సర్వే చేపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ, 30 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ, 30 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు చేస్తున్నట్టు డిప్యూటీ సి.ఎం. చెప్పారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 12.43 లక్షల ఎకరాల భూమిని రీసర్వే చేస్తున్నామని, ఈ భూమి 2 లక్షల సర్వే నెంబర్ల పరిధిలో వుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 23.91 లక్షల సబ్ డివిజన్‌లు సర్వే చేయాల్సి ఉందన్నారు. గతంలోనూ భూముల సర్వేలు జరిగినప్పటికీ అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించడం, భూహక్కులకు రక్షణ కల్పించడం ఈ సర్వే ప్రత్యేకత అని పేర్కొన్నారు. భూహద్దులను ఈ సర్వే ద్వారా ఖచ్చితంగా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో ఆరు నెలలపాటు భూరికార్డులను ప్రక్షాళన చేసిన తర్వాతే ఈ సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలో తొలిదశలో 499 గ్రామాల్లో డ్రోన్లతో చిత్రాలు తీస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, నివాస స్థలాలు కూడా సర్వే చేస్తామని, పట్టణాల్లో కూడా నివాస స్థలాలపై సర్వే చేస్తామన్నారు. జిల్లాలో వందశాతం ఖచ్చితత్వంతో సర్వే పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
బొబ్బిలి నియోజకవర్గంలో ఇనాం భూములకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై దృష్టిసారించాల్సి వుందని స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. ఈ సర్వే ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.
సాగు చేస్తున్న రైతులకు భూమిపై హక్కు లేకుండా ఇతరులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములపై ఆధిపత్యం చెలాయించకుండా ఈ సర్వే దోహదపడుతుందని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు.
ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ భూయజమాని తాను ఎక్కడ నివసిస్తున్నా తన భూమి ఏ పరిస్థితిలో వుందో ఎలా వుందో తెలుసుకుని నిశ్చింతగా వుండే పరిస్థితి ఈ భూసర్వే ద్వారా కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సమగ్ర భూసర్వే చేపట్టక పోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా భూవివాదాలు పరిష్కారం కాక రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, వాటన్నింటికీ ఈ సర్వే పరిష్కారం చూపుతుందన్నారు.
సర్వే విభాగం ఏ.డి. కె.రాజాకుమార్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే జూలై ఒకటి నుంచి ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో భూసమగ్ర సర్వే ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 1551 గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టనున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, బొబ్బిలి మునిసిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, ఇన్ చార్జి ఆర్.డి.ఓ ఎస్.వెంకటేశ్వర్లు, రామభద్రపురం తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.