ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలోని రావులపాలెం మండలం కేతరాజు పల్లి గ్రామంలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారితో కలిసి శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించి, వెదిరేశ్వరం గ్రామంలో రూ.17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ సేవలు పొందడానికి కార్యాలయాల వద్ద గంటల సమయం వేచి వుండే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని మారుస్తూ గతంలో కంటే భిన్నంగా, వేగంగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే అందించడం జరుగుతుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మరింత వేగంగా సేవలు అందించేందుకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరంగా అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలు, ప్రతీ పేదవానికి సకాలంలో వైద్యం అందేలా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లకు శాశ్వత భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో కొన్ని పరిస్థితుల వల్ల నిర్మాణాల్లో జాప్యం జరిగిందని, ఇకనుండి నిర్మాణాల్లో తలెత్తుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో సచివాలయాలు, ఆర్బికే సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు కలిపి మొత్తం 4500 భవనాలకు సుమారు 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మంజూరు కాబడిన శాశ్వత భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలో ఈనెల 17 వ తేదీ నుండి జూలై 2 వ తేదీ వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు సచివాలయం భవనం ప్రారంభం, వెల్ నెస్ సెంటర్ కు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో చేపట్టిన శాశ్వత భవన నిర్మాణాలను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో మరో రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుని ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు జెసి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేతరాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం,వేదిరేశ్వరం గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జెసితో కలిసి స్థానిక శాసనసభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు వెదిరేశ్వరం గ్రామంలోని గ్రామ సచివాయాన్ని, నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం పనులను జెసి, ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్న విధానం, తదితర అంశాలను గురించిజెసి వాలంటీర్లను ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పిడి వరలక్ష్మీ, సర్పంచ్ లు అంబటి సుబ్బలక్ష్మి, బొక్కా కారుణాకరం, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.