ఉద్యోగాల కల్పనలో ఏపీది దేశ చరిత్ర..


Ens Balu
2
Srikakulam
2021-06-18 12:14:01

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు జాబ్ క్యాలండరును విడుదల చేస్తున్నట్లు సిఎం చెప్పారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం పేరిట జాబ్ క్యాలండర్ ను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో విడుదల చేసారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కేవలం రాత పరీక్షల మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాత ఐఐటి, ఐఐఎంల సహకారంతో నూతన విప్లవానికి నాంది పలకనున్నట్లు సిఎం స్పష్టం చేసారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు వివిధ శాఖల్లో ఖాలీగా ఉన్న 1,84,264 రెగ్యులర్ పోస్టులు, కాంట్రాక్ట్ పద్దతిలో 19,701 పోస్టులు, ఔట్ సోర్సింగ్ ద్వారా 3,99,791 పోస్టులతో సహా 6,03,756 పోస్టులను ఇప్పటివరకు భర్తీచేసినట్లు సిఎం తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలోని అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే విధంగా పనిచేసే ప్రతీ ఉద్యోగికి మంచి జీతాలు ప్రతి నెల 1వ తేదీన నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వచ్చేట్టుగా చేసామని, మధ్య దళారీల బెడద లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉద్యోగుల నియామకం ఒకేచోట జరిగేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటుచేసిన సంగతిని సిఎం గుర్తుచేసారు. ఆర్.టి.సి ఉద్యోగుల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ ఏడాదికి రూ.3,600 కోట్ల అదనపు భారాన్ని చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం ఆర్.టి.సిని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా 51,387 మంది ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంపుదల చేయడం జరిగిందన్నారు.

          జూలై మాసం నుండి వచ్చే ఏడాది మార్చి వరకు విద్య,వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ఏ.పి.పి.యస్.సి, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, డి.ఎస్సీ వంటి నియామక సంస్థల ద్వారా ప్రతీ నెల నోటిఫికేషన్లు జారీచేస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు సిఎం వివరించారు.ఎస్.సి,ఎస్.టి,దివ్యాంగులకు చెందిన బ్యాక్ లాగ్ 1,238 ఉద్యోగాలను 2021 జూలై మాసంలో, ఏపిపిఎస్సీ గ్రూప్-1,  గ్రూప్-2కు చెందిన 36 పోస్టులను ఆగష్ట్ లోనూ, పోలీసు శాఖలో  ఖాళీగా ఉన్న 450 పోస్టులను సెప్టెంబరులో, వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 451 వైద్యులు,  అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలను అక్టోబరులో., 5,251 పారా మెడికల్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను నవంబరులో, 441 నర్సు పోస్టులను డిసెంబరులో, 240 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులను 2022 జనవరిలో , 2,000 యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను మార్చి 2022లోనూ వెరశి 10,143 పోస్టులను రానున్న 9 మాసాల్లో భర్తీచేయడం జరుగుతుందని, వాటికి సంబంధించిన జాబ్ విడుదల చేసుకోవడం జరిగిందని సిఎం తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ డా. కే.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి. శ్రీనివాసరావు, నైపణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ గోవింద రావు, ఉద్యోగాలు పొందిన యువత తదతరులు పాల్గొన్నారు.