దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవాన్ని సృష్టించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. కేవలం రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 6లక్షల, 3వేల, 756 మందికి తమ ప్రభుత్వం, ఉద్యోగాలను కల్పించిందని చెప్పారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో, 2021-2022 సంవత్సరానికి సంబంధించిన జాబ్ కేలండర్‌ను శుక్రవారం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఏడాది సుమారుగా 10,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్య, వైద్యం, పోలీసుశాఖల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యతనిస్తూ, ఎపిపిఎస్‌సి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డిఎస్‌సీ తదితర నియామక సంస్థల ద్వారా ప్రతీ నెలా నోటిఫికేషన్లతో పారదర్శకంగా నియామకాలు చేపడతామని అన్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఎం వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, జిల్లా ఉపాదికల్పనాధికారి వై.రవీంద్రకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.