రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,582 వార్డుల్లో శుక్రవారం నాడు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2,887 సచివాలయాల్లో ఒక కేసు, 2,042 సచివాలయాల్లో 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 9,500 సచివాలయాల్లో 2 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. 900 సచివాలయాల్లో 10 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. ఈ వార్డుల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విశాఖలో సిటీలో 1,168 కేసులు, రాజమండ్రిలో 594 కేసులు ఉన్నాయన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేశామని, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించామన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 1,648 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో 176 కాల్స్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు, 896 కాల్స్ వివిధ సమాచారాలకు, 248 కాల్స్ టెస్టులకు వచ్చాయని తెలిపారు. యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గుతున్నా హోం ఐసోలేషన్లో ఉన్న 21,598 మందికి ఫోన్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తూ మందుల వినియోగం, ఇతర విషయాలపైనా 5,196 వైద్యులు సలహాలు సూచనలు అందజేశారన్నారు.
124 మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల గుర్తింపు
కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున వివిధ బ్యాంకుల్లో రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు. మిగిలిన వారి పేరున సోమవారంలోగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2,678 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, 185 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,419 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 966 మంది డిశ్చార్జయ్యారని తెలిపారు. 783 మందికి సర్జరీ చేశామని తెలిపారు. జూన్ 17 వ తేదీ సాయంత్రం వరకూ అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు 9,803 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం కేంద్రం నుంచి అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 39,812 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 74,035 పొసకొనజోల్ మాత్రలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.