కరోనా మూడో వేవ్ అక్టోబరులో వచ్చే అవకాశం ఉందని పలు సంస్థలు, నిపుణులు చెబుతున్నందున ఈలోపే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పిలుపునిచ్చారు. టీకా మాత్రమే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని అందువల్ల నిర్లక్ష్యం వహించకుండా కోవిడ్ టీకా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోని వారంతా తక్షణమే వేయించు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో కోవిడ్ టీకా డోసులు అవసరమైన మేరకు సిద్ధంగా ఉన్నాయని ఆయా కోవిడ్ టీకా కేంద్రాలకు ఆదివారం వెళ్లి టీకా తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచే సిబ్బంది ఆయా కేంద్రాల్లో అందుబాటులో వుంటారని పేర్కొన్నారు. జిల్లాలో 45 ఏళ్ల వయసు దాటిన వారు, ఐదేళ్లలోపు వయస్సుగల పిల్లల తల్లులు ఎంత మంది వచ్చినా టీకాలు వేసేందుకు సిద్ధంగా వున్నట్టు పేర్కొన్నారు. టీకా వేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతోపాటు కుటుంబ సభ్యలకూ కోవిడ్ నుంచి రక్షణ కల్పించినట్లవుతుందన్నారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.