నిరాదరణకు గురి అయిన మహిళలకు ఆర్థిక చేయూత కల్పించవలసిందిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ, మరియు మెప్మా ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ మరియు వివిధ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అనే అంశంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ నవరత్నాల లోని ప్రతి సంక్షేమ పథకాల అమలుపై అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించవలసిన బాధ్యత మీపైన ఉన్నదన్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో కదిరి పరిసర ప్రాంతాలలో మహిళలు నిరాదరణకు గురి అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని, మహిళల అక్రమ రవాణా అనేది రూపుమాపాలని, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ వారికి అందేలా చూడాలని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎన్జీవోల సహకారం తీసుకొని వారిని అభివృద్ధి చేయవలసిన అవసరం వుందని ఆమె తెలిపారు. జిల్లాలోని వివిధ మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేయాలని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను త్వరితగతిన బ్యాంకులకు చెల్లించి అధిక మొత్తంలో రుణాల పొందవచ్చునని, వీటిపైన విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బ్యాంక్ లింకేజీ పథకం అమలులో, శ్రీనిధి పథకాల అమలులో, జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, మహిళా సాధికారత, మెప్మా ఆధ్వర్యంలో వివిధ పథకాలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు పైన దృష్టిసారించాలని తెలిపారు. ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు తెలియజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏపీడి నరసయ్య, ఈశ్వరయ్య, డిఆర్డి ఎ, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.