శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఇసుక రీచ్ లు త్వరితగతిన ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. గనుల శాఖ, ఎస్.ఇ.బి, జెపి గ్రూప్ ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్ లపై సమీక్షించారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇసుక కొరత సమస్య ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల పనులను పూర్తి చేయుటకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని వాటి నిర్మాణానికి ఇసుక కొరత ఎట్టి పరిస్ధితుల్లో ఉండరాదని అన్నారు. ప్రభుత్వ పనులతో సహా శ్రీకాకుళం జిల్లాలో ఇసుక సమస్య అనే మాట వినరాదని ఆయన స్పష్టం చేసారు. ఇసుక సంమృద్ధిగా లభ్యమయ్యే జిల్లాలో ఇసుక కొరత అనేది ఉండరాదని అందుకు తగిన విధంగా ఇసుక ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎటుంటి సమస్యలకు, ఆరోపణలకు తావులేని విధంగా ఇసుక రీచ్ లను నిర్వహించి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 9 రీచ్ లతోపాటు వారం రోజుల్లో కనీసం 10 రీచ్ లు ప్రారంభం కావాలని ఆయన ఆదేశించారు. స్ధానిక సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా సహకారం కావలసి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తద్వారా పోలీసు, రెవిన్యూ యంత్రాంగం సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. అన్ని రీచ్ లను త్వరగా ప్రారంభం కావడం వలన ఇసుక ఉత్పాదకత పెరుగుతుందని విక్రయాలు పెంచవచ్చని గ్రహించాలని ఆయన సూచించారు. జూన్ మాసాంతం వరకు ఇసుక ఉత్పాదకతకు మంచి సమయం అని తరువాత వర్షాలు కురవడం వలన ఇసుక వెలికి తీయడంలో జాప్యం జరగవచ్చని ఆయన అన్నారు. వర్షాలు కురవక ముందే రాంపులు నిర్మించుకోవాలి ఆయన సూచించారు. రీచ్ లను గనుల శాఖ, ఎస్.ఇ.బి అధికారులు తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు.
జెపి గ్రూప్ సమన్వయ అధికారులు ఎన్.గంగాధర రెడ్డి, ఎల్.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ లింగపేట – తిమడాం, పోతయ్యవలస, మడపాం, యరగాం -3, బుచ్చిపేట, గార, నారాయణపురం, దూసి రీచ్ లు పనిచేస్తున్నాయన్నారు. పురుషోత్తమపురం 5,6 రీచ్ లు వారం రోజుల్లోను., హిరమండలం, తునివాడ సోమవారం., కరజాడ మంగళ వారం, ఆకులతంపర బుధ వారం ప్రారంభిస్తామని వివరించారు. అంధవరం, కల్లేపల్లి రీచ్ లలో నీరు పారుతుందని, కందిసలో ఇసుక లేదని చెప్పారు. మిగిలిన రీచ్ లలో స్ధానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన ప్రారంభించుటకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ సమావేశంలో గనుల శాఖ సహాయ సంచాలకులు జి.భైరాగి నాయుడు, ఆర్.రాజేష్ కుమార్, జియాలజిస్ట్ కె.హరి కిరణ్ నాయుడు, ఎస్.ఇ.బి ఎసిపి తదితరులు పాల్గొన్నారు.