90వేల కోవిడ్ వేక్సిన్ల పంపిణీ లక్ష్యం..


Ens Balu
5
Srikakulam
2021-06-19 12:43:31

శ్రీకాకుళం  జిల్లాలో ఆదివారం మెగా కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. మెగా వేక్సినేషన్ కార్యక్రమంపై మండల  అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు మెగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని 300 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. అందుకు అన్ని విధలా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మెగా కార్యక్రమంలో 90 వేల మందికి వాక్సిన్ ఇచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించామని దీనిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. మెగా వాక్సినేషన్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ టీకాలను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. కోవిషీల్డ్ గ్రామీణ ప్రాంతాల్లోని 249 పంచాయతీలతో పాటు అర్బన్ ప్రాంతంలోని 21 వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ చెప్పారు. కోవాక్సిన్ టీకాలను అర్బన్ ప్రాంతంలోని 27 వార్డు సచివాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతంలోని 3 గ్రామ సచివాలయాల్లో సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. కోవిషీల్డ్ గ్రామ సచివాలయాల పరిధిలో గల 74,700 మందికి, వార్డు సచివాలయాల పరిధిలోని 6,300 మందికి టీకాలు వేయడం జరగుతుందని, కోవేక్సిన్ వార్డు సచివాలయం పరిధిలో గల 8,100 మందికి వేయనుండగా, గ్రామ సచివాలయ పరిధిలో 900 మందికి టీకాలను వేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

          ప్రాధాన్యత క్రమంలో టీకాలను వేయాలని ఆయన పేర్కొంటూ 45 ఏళ్లు దాటిన వారు,   0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లులకు మొదటి డోసు టీకాలు వేయాలన్నారు. రెండవ డోసు పెండింగులో ఉన్న హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇతర పౌరులకు టీకాలు వేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా మొదటి డోసు పెండింగులో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేయుటకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

           ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎం.పి.డి.ఓ, తహశీల్ధారు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఆశావర్కర్లు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు వేక్సినేషన్ కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలలో షామియానాలు, కుర్చీలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

          కోవిషీల్డ్ ఆమదాలవలస, భామిని, బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగడాం, గార, హిరమండలం, ఇచ్చాపురం, జలుమూరు, కంచిలి, కవిటి, కోటబొమ్మాళి, కొత్తూరు, యల్.యన్.పేట, లావేరు, మందస, మెళియాపుట్టీ, నరసన్నపేట, నందిగాం, పాలకొండ, పలాస, పాతపట్నం, పోలాకి, పొందూరు, రాజాం, రణస్థలం, రేగిడి ఆమదాలవలస, సంతబొమ్మాళి, సంతకవిటి, సారవకోట, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి, వజ్రపుకొత్తూరు, వంగర, వీరఘట్టం మండలాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుని టీకాను తీసుకోవాలని కోరారు. టీకా తీసుకోవడం వలన కోవిడ్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని మండలాల్లో స్వయంగా పరిశీలించుటకు పర్యటిస్తామని ఆయన తెలిపారు. గతంలో వాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకబడి ఉన్న మండలాలు పూర్తి స్ధాయి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని ఆయన ఆదేశించారు.

సిఫార్సు