గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి నగర్ ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న పేద ప్రజలకు ప్రభుత్వమే స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించి ఇచ్చి స్వచ్ఛందంగా వారే ఆక్రమణలు తొలగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో తాడేపల్లి అమరారెడ్డి నగర్ ప్రాంతంలో ఇరిగేషన్ భూములలో నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. లే అవుట్లోని ప్లాట్ల వద్దే లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందించారు. ఇంటి నిర్మాణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. జగనన్న లే ఆవుట్లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివశిస్తున్న వారిని భద్రత కారణాలతో అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆత్మకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 283 మందికి ఇంటి స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ఇంటి స్థలాలు కేటాయించిన వారికి పట్టాలు, ఇంటి నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయటంతో పాటు, ఆక్రమిత స్థలాలలో నిర్మించుకున్న ఇళ్ళకు పరిహారం రెండు రోజుల్లో అందించటం జరుగుతుందన్నారు. ఆక్రమిత స్థలాల్లో ఎళ్ళ తరబడి నివాసం ఉంటున్న వారికి నష్టం జరగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఎక్కడ లేని విధంగా ఇంటి స్థలం కేటాయించటంతో పాటు ,ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. కానీ కొన్ని మీడియాలలో మాత్రం ఆసత్య వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కలను నిజం చేస్తూ ఇంటి పట్టాల పంపిణీ చేసిన ఘనతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాడేపల్లిలో ఇరిగేషన్ స్థలం ఆక్రమించుకొని 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 283 మందికి ఆత్మకూరులోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. ప్రతి కుటుంభానికి రెండు సెంట్లు స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల నగదు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేయటంతో పాటు, భవన నిర్మాణ సామగ్రిని రాయితీపై పంపిణీ చేస్తుందన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్ సౌకర్యం పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ వెంటనే ఇళ్ళ నిర్మాణాల పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు అధికారులు అవసరమైన పూర్తి సహకారం అందిస్తారన్నారు. కాల్వ గట్టుపై నివశిస్తున్న మాకు స్వంత ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పాలిటి దేవుడి అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ పరిస్థితులలో సైతం కొద్ది రోజులలోనే ఇంటి స్థలాల కోసం భూములు సేకరించి, ఇంటి పట్టాల పంపిణీ చేసేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, రెవెన్యూ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మంగళగిరి తహశీల్దారు రాం ప్రసాదు, తాడేపల్లి తహశీల్దారు శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.