నేరేడు బ్రిడ్జి నిర్మాణం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కాగలదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసన సభాతి తమ్మినేని సీతారాం లుపేర్కొన్నారు. ఖరీఫ్ కు జూలై 8న సాధ్యమైనంత మేరకు వంశధార, మద్దువలస నుండి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ అదును పదును ఉన్నప్పుడే సాగునీటి పనులు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులకు సాగునీటిపై వివరాలు అందించడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లా సస్యశ్యామలం కావాలన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ద వహించి పంటలకు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం వ్యవసాయక జిల్లా అని అన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందాలని ఆయన సూచించారు. ఒడిషా ముఖ్య మంత్రి కి ఏప్రిల్ 16న ముఖ్య మంత్రి లేఖ రాశారని ఆయన చెప్పారు. సమస్య ఉంటే తెలియజేయాలని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి శ్రీకాకుళం జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు మంచి సేవలు అందించుటకు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మంచి మనసున్న ముఖ్య మంత్రి రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పంటలకు ముందుగానే కాలువల నిర్వహణ పనులు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో మంచి ప్రజాప్రతినిధుల బృందం ఉందని, ప్రజాప్రతినిధుల సేవలు ఉపయోగించు కోవాలని ఆయన సూచించారు. పాలకొండ శాసన సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన చెప్పారు. వంశధార, బాహుదా అనుసందానం చేయుటకు రౌతు సత్యనారాయణను సలహాదారుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా జిల్లాలో 70 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కోన్నారు. ఒక్క చుక్క నీటిని కూడా వృథాకాకుండ ప్రాజెక్టు లను ముఖ్య మంత్రి మంజూరు చేసారని చెప్పారు. వెనుకబడిన జిల్లాగా ఉండకూడదని ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు.
రాష్ట్ర పశుసంర్థక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఒక చుక్క నీరు కూడా రాలేదన్నారు. తద్వారా రైతులు నాట్లు వేసిన పరిస్థితి కూదా లేదన్నారు. శివారు నుండి హెడ్ వద్ద ఉన్న భూములకు నీరు అందించే ప్రణాళిక ఉండాలని ఆయన సూచించారు. నీటి విడుదలకు ఒక విధానం అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టు నుండి నీటిని అందించుటకు ముఖ్య మంత్రి నేతృత్వలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. నేరేడు బ్రిడ్జిపై ఒడిషా ముఖ్య మంత్రి తో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో అనేక జలవనరుల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల వివిధ ప్రాజెక్టుల నుండి పంటలకు నీరు విడుదల చేయడం జరుగతుందన్నారు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న నిధులతో కాలువల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర నిధులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన అన్నారు. సాధ్యమైనంత మేర పనులు త్వరగా పూర్తి చేసి సాగునీరు సక్రమంగా అందేటట్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అన్ని పనులు మిషన్ మోడ్ లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలానికి ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ లోనే ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని సూచించారు. కాలువలు పూర్తిగా పూడికలతో నిండి పోయాయని తెలిపారు. శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ సాగునీటి సమస్య తలెత్తకుండా ఇంజనీర్లు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. శాసన సభ్యులు విస్వసరాయి కళావతి మాట్లాడుతూ కాట్రగడ్డ వద్ద అండర్ పాసేజ్ నిర్మించాలన్నారు. బాధ్యతాయుతంగా ఉండని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. 87, 88 ప్యాకేజీలు క్రింద పలు పనులు చేపట్టాలని తద్వారా ప్రజలకు నష్టం సంభవించదని ఆమె పేర్కన్నారు. జంపరకోట రిజర్వాయర్ పనులు 34 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందన్నారు. శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి నిర్వాసితుల త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.
వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ ఈ ఏడాది వంశధార పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని ఆదేశించారని పేర్కోన్నారు. వంశధార రిజర్వాయర్ పనులు 90 శాతం, 87 ప్యాకేజీ పనులు 85 శాతం, ప్యాకేజీ 88 పనులు 96 శాతం, హెచ్.ఎల్.సి పనులు 75 శాతం పూర్తి అయ్యాయని ఆయన వివరించారు. నేరేడు బ్రిడ్జి పూర్తి కావడానికి కృషి చేయాలని తద్వారా 19 శాతం నీటిని రిజర్వాయర్ లో నిల్వ చేయవచ్చని తెలిపారు. ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టాల్సి ఉందని ఎస్ఇ చెప్పారు. ఎల్.ఎం.సి పై నీటి తీరువాతో 51 పనులు మంజూరు చేసామని తెలిపారు. హెచ్.ఎల్.సి 10 శాతం పనులు పూర్తి చేయడం వలన నీటిని విడుదల చేయవచ్చని ఆయన చెప్పారు. కరోనా వలన అన్ని పనులు కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు.
ఈ సమావేశంలో ఎం.ఎల్.సిలు పాకలపాటి రఘు వర్మ, తూర్పుకాపు, కళింగకోమటి కార్పొరేషన్ల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరి బాబు, డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ హెచ్.కూర్మారావు, వ్యవసాయ శాఖ జేడి కే. శ్రీధర్, ఎస్డిసిలు సీతారామ మూర్తి, పి. అప్పారావు, కార్యనిర్వహక ఇంజినీర్లు డి. శ్రీనివాస్, డి.పి. ప్రదీప్, సుధాకర రావు, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.