గ్రామాలను సుందరంగా తీర్చిద్దాలని, పారిశుద్ధ్య చర్యలు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 100 రోజుల పాటు స్వచ్ఛ సంకల్పం కార్యాచరణలో భాగంగా రోజుకో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జూలై 08వ తేదీ నుంచి చేపట్టబోయే స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి ముందుగా వైద్య సిబ్బందితో గ్రామాల్లో సర్వే చేయిస్తామని, అనంతరం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సంకల్పం, భవన నిర్మాణాల పక్షోత్సవాలపై శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేని గ్రామాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని, నిర్వహణ సరిగా లేకుంటూ స్థానిక అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తడి, పొడి చెత్త, మెడికల్ వ్యర్థాల సేకరణపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని ఎంపీడీవోలకు సూచించారు. గ్రామాలన్నీ ఓడిఎఫ్ దిశగా పయనించాలని, ఆ విధంగా తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 959 పంచాయతీల్లో ముందుగా 100 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామని అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పరిస్థితులపై ఆరా తీస్తామని వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ, సచివాలయ, వైద్య సిబ్బంది సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం భవన నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ పెండింగ్ పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. బిల్లులు, ఇతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై మార్గనిర్దేశకాలు చేశారు. పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్స్, సిల్టు లేబర్స్ సమస్యలు తదితర విషయాలపై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ మెషిన్లు సరిపడా లేవని ఉన్నవి మరమ్మతులకు గురయ్యాయని ఈ సందర్భంగా ఎంపీడీవోలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే సచివాలయాల్లో స్టేషనరీకి సంబంధించి విధివిధానాలు సరిగా లేవని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీడీవోలు ప్రస్తావించారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధింత అంశాలతో కూడిన నివేదికలను పంపిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.