ఆంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామివారి జన్మస్థలమని, ఆకాశగంగ వద్ద ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ఛైర్మన్, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి శనివారం బాల ఆంజనేయస్వామివారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆంజనేయస్వామివారి జన్మస్థలం ఆకాశగంగ అని నమ్ముతుందన్నారు. ఇదే విషయాన్ని శ్రీవారి భక్తులు కూడా విశ్వసిస్తూన్నారని, దీనిపై ఎవరితోను ఎలాంటి చర్చలు లేవన్నారు. ఆకాశగంగ వద్ద అంజనాదేవి సమేత బాల ఆంజనేయస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ టిటిడి ఏర్పాటు చేసిన పండిత పరిషత్ నివేదికలో ఆంజనాద్రిలోని ఆకాశగంగ ఆంజనేయస్వామివారి జన్మస్థలమని పురాణాల ద్వారా నిర్ణయించారని తెలిపారు. ఆకాశగంగ వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఆలయ అభివృద్ధిపై కార్యచరణ ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, గోవిందహరి, పార్థపారధిరెడ్డి, డాక్టర్ నిశ్చిత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రాజేష్‌శర్మ, రమేష్‌శెట్టి, శివశంకర్, డి.పి.అనంత, మల్లాది విష్ణు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.