బాధితులకు మెరుగైన కౌన్సిలింగ్..


Ens Balu
2
Anantapur
2021-06-19 16:03:56

గృహ హింస కేసుల్లో బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్ , న్యాయ సలహాలు అందేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ సుజన ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ సమయంలోనే సమస్యకు పరిష్కారం, మహిళలకు న్యాయం దక్కేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ హింస కేసులకు సంబంధించి ఏడాది వారీగా, ప్రాంతాల వారీగా సమాచారం నమోదు చేయాలన్నారు. అప్పుడే కేసులు పెరుగుదల, తరుగుదల పై అధికార యంత్రాంగం ఒక అంచనాకు వచ్చి పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టగలదన్నారు. ఇదే సూత్రం అన్ని అంశాలలోనూ పాటించాలన్నారు.  పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కరోనా కారణంగా అనాధలైన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల పరిహారం త్వరితగతిన దక్కేలా చూడాలన్నారు. పరిహారానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్ వాడీల్లో నాడు-నేడు పనులకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అదేశించారు. 
సమీక్షలో నోడల్ ఆఫీసర్ వనజ, ఈవో భారతి దేవి తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు