విశాఖపోర్టులో సరైన ఉపాది లేక తీవ్ర అవస్థలు పడుతున్న క్యాజువల్ కార్మికులను తక్షణమే ఆదుకోవాలని పోర్టు చైర్మన్ కె.రామ్మోహనరావును అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, పోర్టు ట్రస్టు మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. ఈ మేరకు చైర్మన్, కార్యదర్శి టి.వేణుగోపాల్‌ను శనివారం శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలసి సింహాచలం చందన ప్రసాదం , స్వామి వారిశేష వస్త్రం అందజేశారు. అనంతరం క్యాజువల్ కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 2009 లో సుమారు 300 మంది కార్మికులు డిఎల్ బి నుంచి పోర్టులోకి విలీనమయ్యారని, ఇందులో కొందరికి పర్మినెంట్ చేసినా మిగిలిన మరో 269 మందికి మాత్రం సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని శ్రీనుబాబు వివరించారు. ప్రస్తుతం అరకొర పనుల వల్ల ప్రతినెల వీరికి సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులలో అల్లాడుతున్నారన్నారు. కరోనా సమయంలో వీరి సమస్యలు రెట్టింపుగా మారాయని వివరించారు. క్యాజువల్స్ కు సంబంధించి కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మాండవీయ దృష్టికి విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ ద్వారా పలుమార్లు తీసుకు వెళ్లామన్నారు. కేంద్ర మంత్రి సైతం వీరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు. అయితే తక్షణమే పర్మినెంట్ చేయకపోయినా కనీసం పోర్టులో ఖాళీగా ఉన్న విభాగాల్లో తమ సేవలు ఉపయోగించుకోవాలని కార్మికులు కూడా ఎంతోకాలంగా కోరినట్టు చెప్పారు. బయట వారికి అవకాశం ఇవ్వకుండా పోర్టులోనే సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులకు పని చూపిస్తే వారికి తగిన వేతనాలు పొందే సౌలభ్యం కలుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్వచంద పదవీ విరమణ చేసి త్యాగం చేస్తే వీరికి దశాబ్దాల తరబడి న్యాయం జరగడం లేదని శ్రీనుబాబు పేర్కొన్నారు.