యోగా ప్రక్రియతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని జాయింట్ కలెక్టర్ డా. జి.సి. కిశోర్ కుమార్ అన్నారు. మానవుని జీవన విధానంలో యోగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. భారత పుణ్యభూమిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రక్రియను అనుసరించాలని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయష్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కోట జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు చేపట్టిన 5కే రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా అనేది నేడు మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, జీవన శైలిపై దాని ప్రభావం చాలా వరకు పడిందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రక్రియను అనుసరించటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శరీర, ప్రాణాత్మ, దేహాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి మానవుని యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటం ద్వారా దేశానికి ఉపయోగపడాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి కూడా యోగాను గుర్తించటంతో దాని ప్రాముఖ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. కావున ఈ ప్రక్రియను అందరూ అనుసరించి సంపూర్ణ ఆరోగ్య సమాజ నిర్మాణానికి సహకరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో యోగాసన ప్రక్రియలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం. గణపతిరావు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, ఆయష్ శాఖ జిల్లా పర్యవేక్షకుడు డా. ధనుంజయరావు, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు ఇతర అధికారులు, ఆయష్ శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.