జిల్లాలో ఆక్సిజన్ నిల్వకు లోటు లేదు..


Ens Balu
4
Kakinada
2021-06-20 10:10:55

కోవిడ్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం  కాకినాడ జీజీహెచ్‌లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ రూ.52 లక్షలతో ఏర్పాటుచేసిన 20 కిలో లీటర్ల సామర్థ్యంగల ఆక్సిజన్ ట్యాంకును కలెక్టర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, సంస్థ యాజమాన్యంతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటుకు సహకరించిన, రూ.14 లక్షల విలువైన వెంటిలేటర్లను కూడా అందించిన అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ ఛైర్మన్ కరటూరి సత్యనారాయణమూర్తిని మంత్రి, కలెక్టర్, జేసీలు అభినందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా యుద్ధప్రాతిపదికన ట్యాంకు ఏర్పాటు పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ పిలుపు మేరకు సరైన సమయంలో స్పందించి ఎందరో దాతలు సరైన సహకారాన్ని అందించారని, వారందరినీ అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ కట్టడికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని, అత్యధిక జనాభా కలిగిన జిల్లాలో మరణాల రేటును తగ్గించేందుకు, ఉభయ గోదావరి జిల్లాలకు కీలకమైన కాకినాడ జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం 50 కిలో లీటర్ల సామర్ధ్యం ఆస్పత్రి కి సమకూరిందన్నారు. కోవిడ్ కట్టడికి కృషిచేస్తున్న గ్రామ వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 24X7 పనిచేస్తూ రోగులకు సేవలందిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ అధికార యంత్రాంగానికి సహకరిస్తూ కోవిడ్ కట్టడికి కృషిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్‌కు కొరత లేదని.. 45 ఏళ్లకు పైబడిన వారు, అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీకా వేయించుకోవాలని మంత్రి వేణుగోపాలకృష్ణ సూచించారు. 

జిల్లాలో డోసుల అందుబాటును బట్టి దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో  అందరికీ టీకా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం 1,50,000 డోసుల పంపిణీ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని, ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి కోవిడ్ కట్టడికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.